Share News

ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉలిక్కిపడ్డ జనం

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:35 AM

ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం లో పలుచోట్ల బుధవారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

 ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉలిక్కిపడ్డ జనం
పీటీఎం మండలంలో పడిన వడగండ్లు

ములకలచెరువు/బి.కొత్తకోట/పెద్దతిప్పసముద్రం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం అకాల వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ములకలచెరువు మండలంలోని ములకలచెరువు, పెద్దపాళ్యం, వేపూరికోట, బురకాయలకోటలలో అరగంటకుపైగా వర్షం కురిసింది. ముంబయి - చెన్నై జాతీయ రహదారిలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కన్పించక వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిలో వర్షపు నీరు భారీగా ప్రవహించాయి. ములకలచెరువులో మురికి నీటి కాలువలు ఉప్పొంగాయి. ప్రధాన రోడ్లు, వీధుల్లో వర్షపు నీరు ప్రవహించాయి. స్ధానిక రైల్వేగేటు వద్ద జాతీయ రహదారి పక్కన వర్షపు నీరు నిలిచిపోయాయి. టమోటా మార్కెట్‌, ఆర్టీసీ బస్టాండు బురదమయమయ్యాయి. దీంతో కొంతసేపు జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. వర్షం ఆగిన తర్వాత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. వర్షంతో వాతావరణం చల్లబడింది. ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం కలిగింది.

టెంకాయ చెట్లపై పడ్డ పిడుగు

బి.కొత్తకోట, గట్టు, బీరంగి తదితర ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గట్టు పంచాయతీ గుట్టపాళ్యంలో టెంకాయ చెట్టుపై పిడుగుపడింది. టెంకాయ చెట్టుపై మంటలు కన్పించడంతో సమీప పొలాల్లో రైతులు భయాందోళనకు గురయ్యారు.

పీటీఎంలో వడగండ్ల వాన

పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరు పంచాయతీ గోళ్లపల్లె, నిలువురాతపల్లెల్లో వడగండ్ల వర్షం కురిసింది. గంటపాటు ఉరుములు, మొరుపులతో కూడిన వర్షం కురిసింది. పీటీఎంలోనూ మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో గంగమ్మ జాతరకు కట్టిన షామియానాలు, బ్యానర్లు గాలికి ఎగిరిపోయాయి. వడగండ్లతో చెట్లలోని మామిడి కాయలు రాలిపోయాయి.

Updated Date - Mar 19 , 2026 | 02:35 AM