మరో శ్రీకాళహస్తి యువకుడిపై పీడీ యాక్ట్‌కు ఆమోదం
ABN , Publish Date - May 22 , 2026 | 01:48 AM
పీడీ చట్టం కింద నిర్భంధంలోకి తీసుకున్న శ్రీకాళహస్తికి చెందిన మరో యువకుడి ఉదంతాన్ని కూడా సమర్థిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారమే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన హిరణ్ అనే యువకుడి నిర్భంధానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
కలికిరి, మే 21 (ఆంధ్రజ్యోతి): పీడీ చట్టం కింద నిర్భంధంలోకి తీసుకున్న శ్రీకాళహస్తికి చెందిన మరో యువకుడి ఉదంతాన్ని కూడా సమర్థిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారమే శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన హిరణ్ అనే యువకుడి నిర్భంధానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాళహస్తి పట్టణం ఇమామ్ వీధిలో నివసిస్తున్న షేక్ ఇస్మాయిల్ అలియాస్ గాంజా (31)ని కూడా నిర్భంధించి కడప జైలుకు తరలించేందుకు ఏప్రిల్ 17న కలెక్టర్ నిర్భంధన ఉత్తర్వులు జారీ చేశారు. పీడీ చట్టం నిర్భంధాలను విచారించేందుకు చైర్మన్ సహా ముగ్గురు సభ్యులతో ఏర్పాటయిన రాష్ట్ర స్థాయి అడ్వయిజరీ బోర్డుకు విచారణను అప్పగించారు. రెండేళ్ళలోనే ఇస్మాయిల్‌పై ఏడు కేసులు నమోదయ్యాయని ఇళ్ళ దోపిడీలు, దొంగతనాలు, హత్యాయత్నాలతోపాటు పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అడ్వయిజరీ బోర్డు ఈ నెల 12న నిందితుడు, విచారణాధికారులను నేరారోపణలపై సమగ్రంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. చివరికి ఇస్మాయిల్‌ను నిర్భంధించడానికి చూపిన కారణాలన్నీ సహేతుకమైనవేనని అడ్వయిజరీ బోర్డు నిర్ధారిస్తూ కలెక్టరు ఉత్తర్వులను సమర్థించింది. పూర్వాపరాలను పరిశీలించిన ప్రభుత్వం పీడీ చట్టం కింద ఇస్మాయిల్ నిర్భంధానికి ఆమోదం తెలుపుతూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.