Share News

ప్చ్‌.. మామిడి!

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:43 AM

Officials say that high temperatures are causing disadvantages for mango cultivation. Last month, mango blossoms were abundant.

ప్చ్‌.. మామిడి!

  • ఎండలు పెరిగి రాలుతున్న పిందె

  • రైతుల్లో ఆందోళన.. ఏటా తప్పని తిప్పలు

పంట వస్తే గిట్టుబాటు ఉండదు. ధరలుంటే దిగుబడి తక్కువ. రెండూ కలిసొస్తే వాతావరణం ప్రతికూలిస్తోంది. పూత, పిందె రాలడం, తెగుళ్లు సోకుతున్నాయి. ఇలా ఏటా ఏదో ఒక కారణంతో మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతికూల వాతావరణం ఆందోళనకు గురిచేస్తోంది.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

ఉష్ణోగ్రత్తలు అధికంగా ఉండటంతో మామిడి సాగుకు ప్రతికూలతలు ఏర్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత నెలలో మామిడి పూత విపరీతంగా వచ్చింది. కానీ, 30 శాతం పూత రాలిపోయింది. ఈ నెలలో నిలబడిన పూత.. పిందె దశలో వచ్చేసరికి, ఆ పిందెలు రాలిపోతున్నాయి. మరో వైపు బంక ఆశించడం, తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోడానికి చెట్లపై వివిధ రసాయనాలను పిచకారి చేశారు. అయినా, ఫలితం కనిపించడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది మామిడి పోషణ (యాజమాన్య పద్ధతులు), సస్యరక్షణ చర్యలపై రైతులు అధికంగా దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మామిడి చెట్లు మెట్ట ప్రాంతాలు, బీడుభూముల్లో ఉన్న నేపథ్యంలో రైతులు మామిడి పంటను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఇక, గతేడాది మామిడి పంట విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతుల్లో కొందరు ఈ ఏడాది మామిడి పోషణ (యాజమాన్య పద్ధతులు)పై దృష్టి సారించలేదని తెలుస్తోంది. అందుకనే పూత వచ్చినా, చెట్టుకు పోషణ బలం లేకపోవడంతో రాలిపోతోందని అధికారులు అంటున్నారు. ఈ దశలో పూతను కాపాడుకునేందుకు చెట్లపై మందు పిచికారి చేసినా ఫలితం ఉండటం లేదు. ఎండలు పెరుగుతుండటమే దీనికి కారణం. అందుకని మామిడి చెట్ల మొదళ్లకు నీరు అధికంగా అందించాలి. నీరున్న రైతులు తరచూ.. మెట్ట ప్రాంత రైతులు వారానికి కనీసం రెండు పర్యాయాలైనా నీళ్లు పెట్టాలని అధికారులు చెబుతున్నారు. యూరియా, పోటాషియంతో పాటు వీలైతే ఆవుల ఎరువు చెట్టుకు రెండు గంపల చొప్పున వేస్తే భూమిలో సూక్ష్మ పోషకాలు పెరుగుతాయంటున్నారు. అప్పుడు చెట్లకు బలం వస్తుంది. బోరాన్‌, మైక్రో నూట్రిన్స్‌ నీటిలో కలిపి పిందెలపై పిచికారి చేస్తే రాలిపోకుండా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

1.48 లక్షల ఎకరాల్లో మామిడి

జిల్లాలోని 62 వేల మంది రైతులు 1,48,314 ఎకరాల్లో (59,326 హెక్టార్లు) మామిడి సాగు చేస్తున్నారు. వీటి ద్వారా ఏటా 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 6.21 లక్షల మెట్రిక్‌ టన్నల వరకు మామిడి పంట చేతికి వస్తోంది. దీంతో మామిడిపై రైతులు ఆశలు పెంచుకున్నారు. మామిడిలో టేబుల్‌ వైరటీ రకాలు తక్కువగా ఉండగా, తోతాపురి రకం సాగు అధికంగా ఉంది. ఏటా మామిడి రైతుల లాభనష్టాలను తోతాపురి రకం నిర్దేశిస్తుంది.

ఇలా చేయండి

నీళ్లు కలిగిన రైతులు మామిడి యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. చెట్టు మొదళ్లలో చుట్టూ పాదులు తవ్వడంతో పాటు అధికంగా నీరు పెట్టాలి. ఒక చెట్టుకు అరకిలో యూరియా, అర కిలో పోటాష్‌, 300 గ్రాముల బోరాన్‌ వేసుకుంటే చెట్టు బలపడుతుంది. పూత రాలకపోవడంతో పాటు పిందె బలపడి కాయ సైజ్‌ వస్తుంది.

- కోటేశ్వరరావు, ఏడీ, ఉద్యానశాఖ

Updated Date - Apr 10 , 2026 | 12:43 AM