Share News

ప్రియభక్తుడిపై పట్టాభిరాముడి చిద్విలాసం

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:52 AM

ట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం తన ప్రియభక్తుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకుని భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రియభక్తుడిపై పట్టాభిరాముడి చిద్విలాసం
హనుమంత వాహనంపై ఊరేగుతున్న సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముడు

వేడుకగా స్నపన తిరుమంజనం

వాల్మీకిపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం తన ప్రియభక్తుడైన హనుమంతుడిని వాహనంగా చేసుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని మూలవర్లకు సుప్రభాతం, అభిషేకం, అర్చన, తోమాలసేవలు చేశారు. సీతారామలక్ష్మణులను విశేషాలంకరణతో ముత్యపు పందిర వాహనంపై మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, శ్రీరామ భక్తుల నామస్మరణ నడుమ పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ఊంజల్‌సేవ చేశారు. రాత్రి హనుమంత వాహనంపై దేవతామూర్తులను ఊరేగించారు. అశేష భక్తజనం హాజరై సీతారామలక్ష్మణులను దర్శించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాల్లో టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ మునిబాల, ఆలయ ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, ఆలయాధికారులు కృష్ణమూర్తి, నాగరాజు, నగేశ్‌, వేదపండితులు కృష్ణప్రసాద్‌ భట్టర్‌, మురళి, అర్చకులు భాషికాచార్యులు, రామ్‌గోపాల్‌, భాష్యం స్వామి, సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు హాజరయ్యారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు..

పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం ఊంజల్‌సేవ, రాత్రికి సింహ వాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం ఉంటాయి. స్థానిక శ్రీకృష్ణదేవరాయ బలిజసేవా సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 01:52 AM