నిషేధిత జాబితాలో పట్టా భూములకు త్వరలో విముక్తి
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:10 AM
నిషేధిత జాబితా 22(ఏ) లోని పట్టా భూములకు త్వరలో విముక్తి కలగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ‘22ఏ’ చిక్కుల నుంచి భూములకు విముక్తి, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా 22(ఏ) లోని పట్టా భూములకు త్వరలో విముక్తి కలగనుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై ‘22ఏ’ చిక్కుల నుంచి భూములకు విముక్తి, నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మాన్యువల్ ఎంట్రీలకు స్వస్తి పలుకుతారన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ‘వెబ్‌ల్యాండ్ 2.0’ మాత్రమే ఉంటుందన్నారు. గ్రామకంఠం భూములను 22ఏలో పెట్టకూడదన్నారు. కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వ న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని, కోర్టు విచారణలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోర్టు నుంచి ప్రతికూల తీర్పులు వచ్చే కేసులను ప్రత్యేకంగా పరిశీలించి, వాటికి దారితీసిన కారణాలను గుర్తించి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మ్యూటేషన్ కేసుల్లో వీఆర్వో సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీచేయవద్దని కలెక్టర్ స్పష్టంచేశారు. రీ-సర్వే ప్రక్రియలో షేప్ ఫైల్ కరెక్షన్, ఎక్స్‌టెంట్ కరెక్షన్ అంశాలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. రీ-సర్వే సమస్యలను గుర్తించి పరిష్కారానికి క్రమబద్ధమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు శ్రీనివాసులు నాయుడు, అనుపమ, భవాని, మహమ్మద్ హుస్సేన్ సాహెబ్, ఏడి సర్వేయర్ పుల్లయ్య,తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.