Share News

ఆక్రమణలకు ‘పట్టా’భిషేకం

ABN , Publish Date - May 11 , 2026 | 01:23 AM

బోగస్‌ పత్రాలతో భూముల దోపిడి రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో హస్తగతం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ చొరవతో వెలుగు చూస్తున్న అక్రమాలు

ఆక్రమణలకు ‘పట్టా’భిషేకం

తిరుపతి, ఆంధ్రజ్యోతి: వెంకటగిరి పట్టణంలో భూ ఆక్రమణలపై కొందరు స్థానికులే కమిటీగా ఏర్పడి పోరాడుతున్నారు. బోగస్‌ పత్రాల ఆధారంగా విలువైన ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకున్న వ్యవహారాల అంతు చూస్తున్నారు. ప్రజా ప్రయోజన స్థలాలనూ వదలకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వైనాలను బహిర్గతం చేస్తున్నారు.

వెంకటగిరిలో విలువైన ప్రాంతమైన ఉపాధ్యాయ నగర్‌లో ప్రజాప్రయోజనాలకు, రోడ్ల కోసం వదిలిన స్థలాల్లో కొందరు అక్రమార్కులు దశాబ్దకాలంగా ప్లాట్లు వేసి జనానికి అంటగట్టారు. ఇటీవల ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ అక్రమాలను వెలికితీసేందుకు ఉద్యుక్తులయ్యారు. రికార్డులను పరిశీలించారు. ఆక్రమిత స్థలాల నుంచి ఖాళీ చేయించే పనికి శ్రీకారం చుడుతుండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదే ప్రాంతంలో కొందరు ప్రభుత్వ స్థలాలకు పాత రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో పట్టాలు సృష్టించారు. ఈ విషయంలో ప్రస్తుత అధికారులనూ ప్రలోభపెట్టినట్లు సమాచారం. వైసీపీ మాజీ కౌన్సిలర్‌ భర్త, అదే పార్టీకి చెందిన కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఈ విషయంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాట్ల పంపిణీలో లుకలుకలు రావడంతో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వీరిమధ్య సర్దుబాటు చేస్తున్నట్లు బోగట్టా.

ఎన్జీవో కాలనీలో 30 ఏళ్ల కిందట ప్రభుత్వం వేసిన లేఅవుట్‌లో ఎన్జీవోలకు పట్టాలు పంపిణీ చేసింది. ఇక్కడ ప్రజావసరాల కోసం సర్వే నెం. 150-1, 151-1, 152లో ఎకరా స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని కాజేయడానికి కొందరు కన్నేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద్వితీయ శ్రేణి నాయకుడు తన సతీమణి సరస్వతి పేరుతో 5 సెంట్లు, వదిన సత్యవతి పేరుతో మరో 5 సెంట్లకు అనుభవ పట్టాలను 2024లో తీసుకున్నారు. ఈ పట్టాలను ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఇవ్వడం గమనార్హం. పైగా 2009 నుంచి ఈ స్థలం తమ అనుభవంలో ఉన్నట్లు ఆ పట్టాలో పేర్కొన్నారు. ఇలాగే మరో నలుగురికి కూడా ఐదు సెంట్ల చొప్పున ఇదే ఇన్‌చార్జి తహసీల్దార్‌ పట్టాలను ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈఎ్‌సఎస్‌ డిగ్రీ కళాశాల ఎదురుగా సర్వే నెం. 109-9లో ఉన్న స్థలానికి వారసులు లేకపోవడంతో కొంతమంది అక్రమార్కులు నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి దొంగ పట్టాలతో భూమిని రిజిస్ర్టేషను చేయించుకున్నట్లు తెలిసింది.

ఫ 1965లో మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా సర్వే నెం. 199-3, 199-4, 199-5, 200-2లో మూడెకరాల ప్రభుత్వ స్థలంలో తాలూకా సమితి కార్యాలయం, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మించారు. 1968లో ఈ భవనాల్లోనే ప్రైవేటు యాజమాన్యం విశ్వోదయ కళాశాలను ప్రారంభించింది. 1974లో సర్వే నెం.201లో 13.88 ఎకరాలను యాజమాన్యం కొనుగోలు చేసి కళాశాలను అందులోకి మార్చింది. ఈ భూమిని సొంతం చేసుకునేందుకు పెద్ద స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొంతమంది రెవెన్యూ అధికారులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థానికుల చొరవకు ప్రశంసలు

ఆక్రమణల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డారు. నిఘా నేత్రంగా వ్యవ హరిస్తున్నారు. కమిటీ సభ్యులు ఇటీవల కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కలిశారు. అక్రమాలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు స్థానికులే కమిటీగా ఏర్పడి చొరవ తీసుకుంటున్న తీరును పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు. కమిటీ ప్రస్తావించిన ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 11 , 2026 | 01:24 AM