Share News

కార్యకర్తలే టీడీపీ ప్రాణం

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:55 AM

‘తమ జీవితాలు తల్లకిందులయ్యే పరిస్థితులు ఎదురైనా పార్టీ జెండా పైనే ఉండాలని కార్యకర్తలు భుజాన మోసుకుని వెళ్తారు. అటువంటి కార్యకర్తలే టీడీపీకి ప్రాణం’ అని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.

కార్యకర్తలే టీడీపీ ప్రాణం
వేపూరు సభలో మహిళలకు అభివాదం చేస్తున్న భువనేశ్వరి

జెండా మోసి త్యాగాలు చేసేది వారే

పెద్ద నాయకులు వాళ్ల అవసరంకోసం వస్తారు.. వెళ్తారు

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి

కుప్పం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ‘తమ జీవితాలు తల్లకిందులయ్యే పరిస్థితులు ఎదురైనా పార్టీ జెండా పైనే ఉండాలని కార్యకర్తలు భుజాన మోసుకుని వెళ్తారు. అటువంటి కార్యకర్తలే టీడీపీకి ప్రాణం’ అని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తన పర్యటనలో మూడో రోజైన బుధవారం ఆమె కుప్పం మండలం వసనాడు, వేపూరు, గరిగచీనేపల్లె గ్రామాలలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ‘నాయకుడు పిలుపునిస్తే ముందూ వెనుకా చూడకుండా రంగంలోకి దూకేది కార్యకర్తలే. పార్టీ కార్యక్రమమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా ముందుండి అమలు చేసేది వారే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై దౌర్జన్యాలు చేశారు. ఎన్నో కేసులు వేశారు. వారి జీవితాలను నాశనం చేశారు. అయినా బెదరలేదు. వారి జీవితాలను త్యాగం చేసి మరీ నాయకుడికోసం, పార్టీకోసం నిట్టనిలువున నిలబడ్దారు’ అంటూ కార్యకర్తల త్యాగాన్ని ప్రశంసించారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు.. తొలిసారిగా జనంలోకి వచ్చిన తనకు అండగా నిలిచి ధైర్యం ఇచ్చింది కార్యకర్తలేనన్నారు. ‘పెద్ద నాయకులు వారి అవసరంకోసం వస్తారు. వారిలో కొంతమంది అవసరం తీరాక లేదా తీరదని తెలిశాక వెళ్లిపోతారు. కార్యకర్తలు అలా కాదు. కష్టమైనా, నష్టమైనా నాయకుడి వెన్నంటే నడుస్తారు’ అని స్పష్టం చేశారు. అటువంటి కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. టీడీపీలో ఉన్నటువంటి నిస్వార్థమైన కార్యకర్తలు మరే పార్టీలో లేరన్నారు. కార్యకర్తల కష్టాన్ని గమనించారు కాబట్టే లోకేశ్‌, వారికి బీమా చేయించారని గుర్తుచేశారు.

సమస్యలుంటే నాయకులను అడగండి

‘మీకేమన్నా సమస్యలు తీరకపోయినా, మౌలిక సదుపాయాలు కల్పించకపోయినా ధైర్యంగా నాయకులను అడగొచ్చు. మిమ్మల్ని, మీ కుటుంబం, గ్రామం బాగోగుల్ని చూసుకోవాల్సిన బాధ్యత వారికుంది’ అని మహిళలకు భువనేశ్వరి సూచించారు. చంద్రబాబుమీద అపార నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు వస్తున్నాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి యువత భవిష్యత్తు బంగామయం అవుతుందని భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేష్‌ బాబు, రెస్కో చైర్మన్‌ వీజీ ప్రతాప్‌, ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, టీటీడీ సభ్యుడు వైద్యం శాంతారాం, ఏఎంసీ చైర్మన్‌ జీఎం రాజు, కడా పీఏసీ సభ్యుడు రాజ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రాజగోపాల్‌, చెక్కునత్తం మణి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విధ్వంసంనుంచి నిర్మాణం దిశగా ఆలయాలు

వైసీపీ అయిదేళ్ల పాలనలో సాగిన విధ్వంసం నుంచి హిందూ దేవతల ఆలయాలు కూటమి ప్రభుత్వంలో నిర్మాణం దిశగా అభివృద్ధి చెందుతున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ బాబునగర్‌లోని దశమేశ్వరి ఆలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని మండపంనుంచి ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఘనమైనవన్నారు. వైసీపీ హయాంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయని, రథాలు కాలిపోయాయని, ఆలయాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసం నుంచి ఆలయాలను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారన్నారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని ఆలయాలను రూ.90 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ప్రతి ఆలయానికీ రూ.25 లక్షలు మంజూరు చేశారన్నారు. మనవైన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 12:55 AM