Share News

టీఈఆర్‌ ప్రణాళిక రూపకల్పనలో అందరి భాగస్వామ్యం

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:05 AM

తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌(టీఈఆర్‌) ప్రణాళిక రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు ఎంతో కీలకమని టీఈఆర్‌ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా అభిప్రాయపడ్డారు.

టీఈఆర్‌ ప్రణాళిక రూపకల్పనలో అందరి భాగస్వామ్యం
కలెక్టరేట్‌లో జరిగిన తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌ సదస్సు

తిరుపతి కలెక్టరేట్‌ , సెప్టెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి):తిరుపతి ఎకనామిక్‌ రీజియన్‌(టీఈఆర్‌) ప్రణాళిక రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు ఎంతో కీలకమని టీఈఆర్‌ సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా అభిప్రాయపడ్డారు.తిరుపతి కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన టీఈఆర్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికను కేవలం డేటా సేకరణ, నివేదిక తయారీగా కాకుండా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సిటీ ప్లానర్లు, ప్రభుత్వ అధికారుల ప్రత్యక్ష సూచనల ఆధారంగా రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విభిన్న వర్గాల సూచనలను సమన్వయం చేస్తేనే సమగ్ర ప్రణాళిక రూపొందుతుందని చెప్పారు.తిరుపతి,నెల్లూరు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న స్పేస్‌, డిఫెన్స్‌ క్లస్టర్లను అనుసంధానం చేసి ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేలా వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్లానింగ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ అనంత శంకర్‌ మాట్లాడుతూ టీఈఆర్‌ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో సహజ వనరులను, మౌలిక సదుపాయాలను, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే లక్ష్యమన్నారు.తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన బలమైన రహదారి అనుసంధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను స్థానిక యువతకు అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ పరిశ్రమలు, సేవా రంగాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా కళాశాల స్థాయి నుంచే ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్‌, విజయశ్రీ, ఆదిమూలం, తిరుపతి కమిషనర్‌ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 02:05 AM