కలెక్టర్ చెంతకు చేరిన బొప్పాయి పంచాయితీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:40 AM
బొప్పాయి ధరల పంచాయితీ చివరకు కలెక్టర్ వద్దకు చేరింది.మార్వాడీ వ్యాపారులు టన్ను రూ. 18వేలకు కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశిం చినా ఫలితం లేకుండా పోయింది.
టన్ను రూ. 16వేలతో కొనుగోలు చేయాలని ఆదేశం
రైల్వేకోడూరు/తిరుపతి(కలెక్టరేట్), జూలై 23(ఆంధ్రజ్యోతి): బొప్పాయి ధరల పంచాయితీ చివరకు కలెక్టర్ వద్దకు చేరింది.మార్వాడీ వ్యాపారులు టన్ను రూ. 18వేలకు కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశిం చినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రైల్వేకోడూరులో మార్వాడీ వ్యాపారులు, మధ్యవర్తులతో కలసి తహసీల్దార్ అమర్‌నాథ్, ఎస్‌ఐ వీఎల్ ప్రసాదరెడ్డి, ఉద్యానశాఖ అధికారి వెంకటభాస్కర్ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అమర్‌నాథ్ బొప్పాయి టన్ను ధర రూ. 18వేలను మార్వాడీ వ్యాపారులు కొనసాగించకపోతే బొప్పాయి లారీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అయితే మార్వాడీ వ్యాపారులు టన్ను బొప్పాయికి రూ. 14వేలకు మించి ఇవ్వలేమనడంతో కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.దీంతో గురువారం తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌తో బొప్పాయి రైతులు, మార్వాడీ వ్యాపారులు, మధ్యవర్తులు, స్థానిక అధికారులు చర్చలు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ టన్ను బొప్పాయి ధర రూ. 16వేలకు ఖరారు చేయగా అందరూ సమ్మతించారు. ఈ ధరకు ఎవరైతే కాయలు కొనుగోలు చేయరో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
రూటు మార్చిన బొప్పాయి లారీలు
అధికారులు బొప్పాయి ధరలను నిలకడగా వుంచేందుకు కృషి చేస్తుంటే మధ్యవర్తులు, మార్వాడీ వ్యాపారులు గురువారం సుమారు 30 లారీల కాయలను రైతుల తోటల్లో బలవంతంగా కోసి చిట్వేలి నుంచి రాపూరు మీదుగా రూటు మార్చి పంపారు. కొందరు వ్యాపారులు టన్ను రూ. 16వేలు, మరి కొందరు రూ. 14వేలతో కోతలు కోసినట్లు రైతులు తెలిపారు. ఈ విషయంలో మద్యవర్తులే కీలకంగా వ్యవహరించారని రైతులు ఆరోపించారు.