Share News

పంచాయతి ఎన్నికలు మరింత ఆలస్యం

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:50 AM

మార్చిలో ముగియనున్న కమిషనర్‌ పదవీకాలం అడ్డుగా కులగణన

పంచాయతి ఎన్నికలు మరింత ఆలస్యం

చిత్తూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే నెలలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మార్చిలో వారి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం చేయమని శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల్చిన నేపథ్యంలో కూటమిలోని మూడు పార్టీల నాయకులు ఈ పదవుల మీద పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితులు కన్పించడం లేదు.

మూడు నెలల ముందే ఈసీ ఆదేశాలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్నప్పుడు 2021 ఫిబ్రవరిలో పంచాయతి ఎన్నికలు విడతల వారీగా నిర్వహించారు. అప్పట్లో 1410 గ్రామ పంచాయతీలుండగా, 8 పంచాయతీల్లో హైకోర్టు స్టే ఉండడంతో ఎన్నికలు నిర్వహించలేదు.మార్చిలో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మూడు నెలల ముందే, అంటే 2026 జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని 2025 సెప్టెంబరు 3వ తేదీన ఆదేశించారు. దీంతో జిల్లాలోని కూటమి పార్టీల నాయకుల్లో ఆశలు చిగురించాయి. తీరా ఇప్పుడు చూస్తే మూడు నెలల ముందు కాదుకదా, యథావిధిగా కూడా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.

మొదలవ్వని ముందస్తు ప్రక్రియ

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం మూడు నెలల ముందు నుంచే తదనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. వార్డుల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం, వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, ఎన్నికల అధికారుల నియామకం, పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేసి బ్యాలెట్‌ పెట్టెలు సిద్ధం చేసుకోవడం, రాజకీయ పార్టీలతో సమావేశాలు.. వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. ఇంతవరకు ఇలాంటివేమీ జరగలేదు.

ఆలస్యం ఎందుకంటే..

ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి నీలం సాహ్ని ఉన్నారు. ఆమె పదవీకాలం మార్చితో పూర్తి కానుంది. కొత్త కమిషనర్‌ నియామకం, ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బీసీ గణన చేయాలి.. రిజర్వేషన్లను తేల్చాలి. ఇదంతా అయ్యాకే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఫార్మాలిటీ ప్రకారం ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా సిద్ధం చేయమని ఆదేశాల్చినా, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు.

ప్రత్యేకాధికారుల నియామకం..?

సర్పంచుల పదవీ కాలం పూర్తికానున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ఆయా పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల్ని నియమించక తప్పేలా లేదు. పాలకవర్గాలుంటే పదవులు దక్కాయని అటు పార్టీ నాయకులు సంతృప్తి పొందుతారు... ఇటు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించి ఓటర్లకు దగ్గరవుతారు. అదే ప్రత్యేకాధిరుల పాలన ఉంటే సమస్యలు పరిష్కారం కావన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. చివరికి ప్రత్యేకాధిరుల నియామకంపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.

Updated Date - Feb 08 , 2026 | 12:50 AM