Share News

విషాదంలో పాదిరికుప్పం

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:21 AM

వరదయ్యపాళెం మండలంలోని పాదిరికుప్పం విషాదంలో మునిగింది.శబరిమలకు వెళుతున్న మినీబస్సును మరో బస్సు ఢీకొనడంతో గ్రామస్తుడొకరు చనిపోగా 13 మంది అయ్యప్ప భక్తులు గాయాల పాలైన విషయం తెలిసి గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు.

విషాదంలో పాదిరికుప్పం
మృతులు లక్ష్మీపతి, జనార్దన్‌ (ఫైల్‌ ఫొటోలు)

-తమిళనాట రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

-13 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

సత్యవేడు/వరదయ్యపాళెం , నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వరదయ్యపాళెం మండలంలోని పాదిరికుప్పం విషాదంలో మునిగింది.శబరిమలకు వెళుతున్న మినీబస్సును మరో బస్సు ఢీకొనడంతో గ్రామస్తుడొకరు చనిపోగా 13 మంది అయ్యప్ప భక్తులు గాయాల పాలైన విషయం తెలిసి గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు.గ్రామస్తుల కథనం మేరకు.....పాదిరికుప్పానికి చెందిన 14మంది అయ్యప్ప భక్తుల బృందం ఈ నెల 21న శబరిమలకు మినీ బస్సులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న మినీబస్సు సోమవారం ఉదయం 6 గంటలకు విళుప్పురం జిల్లా దిండివనం వద్ద చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. కన్నిగాపురం బస్టాప్‌ సమీపంలో మినీబస్సు డ్రైవర్‌ టీ తాగేందుకు బస్సును ఆపాడు. అదే సమయంలో తేని నుంచి చెన్నై వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి తొలుత రోడ్డు పక్కన ఆపిఉన్న లారీని ఢీకొట్టి, అనంతరం మినీ బస్సును ఢీకొట్టి దుకాణంలోకి దూసుకు వెళ్ళింది. అయ్యప్ప భక్తుల వ్యాన్‌ను ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీకొట్టడంతో వ్యానుబోల్తా పడి నాలుగు పల్టీలు కొట్టినట్లు సమాచారం. దీంతో వ్యానులో డోరు పక్కన ఉన్న పాదిరికుప్పానికి చెందిన లక్ష్మీపతి (35), తమిళనాడు రాష్ట్రం గుమ్మడిపూడికి చెందిన వ్యాను డ్రైవర్‌ జనార్దన్‌ (24) వ్యాను నుంచి ఎగిరి కిందపడి ఇరుక్కుపోయి మృతి చెందారు. కాగా వ్యానులోని సూర్య, అయ్యప్ప, దాము, శేఖర్‌, మునీంద్ర, యోగేష్‌, కన్నయ్య ఆచారి, రవి ఆచారి, లక్ష్మీపతి, చంద్రారెడ్డి, చిన్నారి రిషితకు స్వల్ప గాయాలు కాగా కన్నయ్య ఆచారి, శేఖర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఐదు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మైలాం పోలీసులు, అగ్ని మాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాను నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం దిండివనం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను 108 వాహనాల ద్వారా సమీపంలోని ముడియంబాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమయిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా మృతి చెందిన లక్ష్మీపతి శ్రీసిటీలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.అయ్యప్ప మాల ధరించి దైవ దర్శనానికి వెళుతున్న తమ వాళ్ళ ప్రమాద వార్త తెలియగానే పాదిరికుప్పంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమిళ న్యూస్‌ చానెళ్ళలో ప్రసారమైన ప్రమాదవార్త తెలుసుకుని ఎవరికి ఏ ప్రమాదం జరిగిందో ఎలా ఉన్నారో అంటూ గ్రామస్తులు ఆందోళన పడ్డారు.

Updated Date - Nov 24 , 2026 | 01:21 AM