Share News

నేడు తిరుపతిలో పీ4 తొలి వార్షికోత్సవం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:56 AM

పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం వినూత్న రీతిలో పీ4 (పబ్లిక్‌,ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్ట్నర్‌షిప్‌) పేరిట ప్రవేశపెట్టిన కార్యక్రమం అమల్లోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా తొలి వార్షికోత్సవం నేడు తిరుపతిలో జరగనుంది.

 నేడు తిరుపతిలో పీ4 తొలి వార్షికోత్సవం

మార్గదర్శులకు అవార్డుల ప్రదానం

తిరుపతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం వినూత్న రీతిలో పీ4 (పబ్లిక్‌,ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్ట్నర్‌షిప్‌) పేరిట ప్రవేశపెట్టిన కార్యక్రమం అమల్లోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా తొలి వార్షికోత్సవం నేడు తిరుపతిలో జరగనుంది. మహిళా వర్శిటీలోని ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం 4 నుంచీ 6.30 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారు. తొలి ఏడాది రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పీ4 కార్యక్రమం అమలుకు విశేషంగా కృషి చేసిన మార్గదర్శులకు ఆయన అవార్డులు అందజేయనున్నారు. అలాగే ఈ సదస్సు నుంచే వర్చువల్‌గా వివిధ జిల్లాలకు చెందిన మార్గదర్శులతో ముఖాముఖీ మాట్లాడనున్నారు.తిరుపతి జిల్లాకు సంబంధించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖీ మాట్లాడతారు.

రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైంది వీరే!

సమగ్ర మార్గదర్శి అవార్డుకు అనకాపల్లికి చెందిన ఆర్‌హెచ్‌ఐ మాగ్నెసిటా ఇండియా లిమిటెడ్‌ సంస్థ తరపున సీఎ్‌సఆర్‌ మేనేజర్‌ మన్నం నాగేశ్వరరావు, జ్ఞాన మార్గదర్శి అవార్డుకు చిత్తూరుకు చెందిన రోప్స్‌ స్వచ్చంద సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.ధనశేఖరన్‌, ఆదర్శ మార్గదర్శి అవార్డుకు కాకినాడకు చెందిన డాక్టర్‌ దివ్య బుర్రా సునీతా రాజ్‌ ఎంపికయ్యారు.

జిల్లాలో 20 మందికి అవార్డులు, సర్టిఫికెట్లు

జిల్లాలో ఒకరికి మెమెంటోతో కూడిన అవార్డు, మరో 19 మందికి సర్టిఫికెట్లు చొప్పున మొత్తం 20 మంది మార్గదర్శులకు ప్రదానం చేయనున్నారు. ఇందులో వెంకటగిరి నియోజకవర్గం నుంచీ శ్రీనివాసన్‌ సర్వీసెస్‌ ట్రస్టు అవార్డుకు ఎంపికైంది. అదే నియోజకవర్గం నుంచీ చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్‌ ట్రస్టు, గంగోడు నాగేశ్వరరావు, చంద్రగిరి నియోజకవర్గం నుంచీ భానుప్రకాష్‌, మార్పూరి హేమశేఖర్‌, ఎం.గౌతమ్‌ ఆనంద్‌, ఆర్‌.సుదర్శన్‌, సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచీ టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌, 786 సేవా సంఘం, గున్నం సేవా ట్రస్టు, సత్యవేడు నియోజకవర్గం నుంచీ యాక్షన్‌ ఫర్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ సంస్థ, పి.సురేష్‌ నాయుడు, కొండూరు బాలరాజు, గూడూరు నియోజకవర్గం నుంచీ సంయుక్త సేవాసమితి, పెన్వర్‌ సీ ఫుడ్స్‌, ఎన్‌.భాస్కర్‌రెడ్డి తదితరులు సర్టిఫికెట్లు అందుకోనున్నారు.

జిల్లాలో 86,819 బంగారు కుటుంబాలు

జిల్లాలో ప్రభుత్వం మొత్తం 86,819 బంగారు కుటుంబాలను గుర్తించింది. ఇప్పటి వరకూ మండలాలను, గ్రామాలను, కుటుంబాలను దత్తత తీసుకునేందుకు 5,333 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. ఈ మార్గదర్శుల్లో కొన్ని పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలు వుండగా మరికొందరు వ్యక్తులు వున్నారు. వ్యక్తుల విషయానికొస్తే కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మొదలుకుని సామాన్యుల దాకా మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారున్నారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ కలెక్టరేట్‌ భవనం పక్కనే వున్న షికారీ కుటుంబాలను దత్తత తీసుకోగా మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య కొన్ని నిరుపేద కుటుంబాలకు మార్గదర్శిగా వ్యవహరించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - Mar 30 , 2026 | 12:56 AM