Share News

అన్నింటినీ అధిగమించి.. ‘గ్రూపు’ను సాధించి

ABN , Publish Date - Feb 01 , 2026 | 01:56 AM

కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే.. అంగవైకల్యం, పేదరికం అడ్డే కాదని నిరూపించారు కృష్ణవేణి. కుగ్రామంలో పుట్టి, సర్కారు బడిలో చదివిన ఆమె గ్రూపు వన్‌తో పాటు గ్రూపు-2లోనూ ఎంపికయ్యారు. యువతకు ఆదర్శంగా.. స్ఫూర్తిగా నిలిచారు.

అన్నింటినీ అధిగమించి.. ‘గ్రూపు’ను సాధించి
కృష్ణవేణికి విజయవాడ దుర్గమ్మ ప్రసాదం తినిపిస్తున్న వదిన పూర్ణిమ

వన్‌, టూలోనూ ఎంపికైన కృష్ణవేణి

కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే.. అంగవైకల్యం, పేదరికం అడ్డే కాదని నిరూపించారు కృష్ణవేణి. కుగ్రామంలో పుట్టి, సర్కారు బడిలో చదివిన ఆమె గ్రూపు వన్‌తో పాటు గ్రూపు-2లోనూ ఎంపికయ్యారు. యువతకు ఆదర్శంగా.. స్ఫూర్తిగా నిలిచారు.

- శ్రీరంగరాజపురం/ వెదురుకుప్పం, ఆంధ్రజ్యోతి

కృష్ణవేణిది ఎస్‌ఆర్‌పురం మండలం జీఎంఆర్‌పురం గ్రామ పంచాయతీ వడ్డికండ్రిగ గ్రామం. తల్లిదండ్రులు ఎం.దొరస్వామి, ఎం.రత్నమ్మ కూలి పనులకు వెళ్లొస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆ కూలి డబ్బులతోనే వీరు ముగ్గురు పిల్లలైన పురుషోత్తం, కృష్ణవేణి, జానకిరాంను చదివించారు. కుమారులిద్దరూ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఇక, కృష్ణవేణి వడ్డికండ్రిగలోని ప్రాథమిక పాఠశాలలో 5 వరకు చదివారు. ఆరో తరగతికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఎస్‌ఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరారు. ఆదే సంవత్సరం ఇంటి వద్ద దుస్తులు ఉతికి ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురవడంతో ఆమె ఎడమ కాలు, ఎడమ చెయ్యి తొలగించారు. అప్పటి వరకు హుషారుగా పరుగులు తీస్తున్న ఆమె.. ఒక్కసారిగా అంగవైకల్యం రావడంతో ఏమాత్రం కుంగిపోలేదు. అంగవైకల్యంతో ఇంకేం చదువుతుందని గ్రామస్తులు చెప్పినా ఆమె కుటుంబీకులూ వెనకడుగు వేయలేదు. ఆమెను చదివించేందుకు చొరవ చూపారు. ఇంతటి ప్రోత్సాహం, తన పట్టుదలతో ఆమె చదువు కొనసాగించారు. పదో తరగతిలో టాపర్‌గా నిలిచి ట్రిపుల్‌ ఐటీకి ఎంపికై.. ఇడుపులపాయలో చేరి బీటెక్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 2023లో గ్రూపు వన్‌కు ప్రయత్నించి విఫలమైనా వెనుకడుగు వేయలేదు. హైదరాబాదులో శిక్షణ పొంది, రఫీ అనే ఉద్యోగి గైడెన్స్‌లో గ్రూపు వన్‌, టులోనూ ఎంపికయ్యారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహమే

మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసి నన్ను చదివించారు. నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. నా తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు, స్నేహితులు, మెంటాస్‌ సహకారంతో గ్రూపు వన్‌లో అసిస్టెంటు ట్యాక్స్‌ కమిషనరుగా.. గ్రూపు టులో సివిల్‌ సప్లయ్స్‌లో ఎంపికయ్యాను.

- ఎం.కృష్ణవేణి

మా సంతోషానికి అవధి లేదు

కూలి పనులు స్థానికంగా లేకపోవడంతో ఊరుగాని ఊరుకెళ్లాం. కూలి పనులు చేసుకొచ్చి బిడ్డలను పోషించాం. మా కష్టం.. మా బిడ్డలు పడకూడదని, తలెత్తుకుని తిరగాలని కోరుకున్నాం. అందుకనే కష్టపడి చదివించాం. కొడుకులిద్దరూ డిగ్రీ చదివారు. దేవుడి దయతో కృష్ణవేణి పెద్ద ఉద్యోగానికి ఎంపికైందని తెలిసి సంతోషిస్తున్నాం. ఆమెకు కాలు చేయి లేకపోయినా ‘సైకిల్‌’పై తీసుకెళ్లాం. కష్టపడి చదివి.. ఉద్యోగం సాధించడం మా సంతోషానికి అవధి లేకుండా చేసింది.

- దొరస్వామి, రత్నమ్మ, కృష్ణవేణి తల్లిదండ్రులు

Updated Date - Feb 01 , 2026 | 01:56 AM