గుర్రంకొండలో వెయ్యి మందికి పైగా బయట రాష్ట్రాల వ్యక్తులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:24 AM
గుర్రంకొండ పట్టణం, కొన్ని గ్రామాల్లో బయట రాష్ట్రాల వ్యక్తులు అధికంగా ఉన్నారు. బిహార్, ఛత్తీ్‌సగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సుమారు 1000 మంది ఉన్నారు.
కనీస వివరాలు సేకరించిన వైనం
ఎన్నికల వేళ పట్టణం, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలతో పోలీసులకు పలు సమస్యలు వచ్చిపడుతుంటాయి. గ్రామాల్లో ఎక్కువగా గొడవలు జరుగుతాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. వీరిని అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతుంది.
గుర్రంకొండ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గుర్రంకొండ పట్టణం, కొన్ని గ్రామాల్లో బయట రాష్ట్రాల వ్యక్తులు అధికంగా ఉన్నారు. బిహార్, ఛత్తీ్‌సగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సుమారు 1000 మంది ఉన్నారు. ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలు, పొలాలు, హోటళ్లు, టీ దుకాణాలు, వాటర్‌ప్లాంట్లు, టమోటా మార్కెట్ యార్డులో పనిచేస్తున్నారు. సాయంత్రమైతే గుంపులు, గుంపులుగా రోడ్లపై ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే ఓ చోట పనిచేస్తారు. అక్కడున్న సమయంలో చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుని మరో చోటికి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో మేస్త్రీలకు కూడా ఎవరు ఎక్కడున్నది తెలియడం లేదు. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యులెవరన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొదట బయట రాష్ట్రాల నుంచి కూలీలను పిలిపిస్తున్న మేస్త్రీలు ఎంతమంది ఉన్నారో పోలీసులు ఆరా తీయాల్సి ఉంది.
వివరాలు సేకరించే వారేరీ?
బయట రాష్ట్రాల వ్యక్తులు ఇక్కడ పనిచేయాలంటే ముందుగా ఆధార్ కార్డు, నివాస ప్రాంతం, ఆయా రాష్ట్రాల్లోని పోలీ్‌సస్టేషన్‌లో వారిపై ఎటువంటి కేసులూ లేవని సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ వివరాలను మేస్త్రీలు సేకరించి తమ వద్ద ఉంచుకోవాలి. అయితే చాలా మంది వివరాలు సేకరించడం లేదు. తమకు రావాల్సిన కమీషన్లు తీసుకుని మేస్త్రీలు ఊరకుండిపోతున్నారు. దీంతో ఏ కూలీ ఏ రాష్ట్రానికి చెందిన వాడో తెలియడం లేదు.
జార్ఖండ్‌లో అదృశ్యం..గుర్రంకొండలో ప్రత్యక్షం
జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయ మాటలు చెప్పి రెండేళ్ల క్రితం తీసుకొచ్చేశాడు. 8 నెలలపాటు కడప ప్రాంతంలో ఉంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. అనంతరం అక్కడి నుంచి గుర్రంకొండ మండలం తరిగొండ సమీపంలోని ఓ వ్యవసాయ ఏస్టేట్‌లో పని చేయడానికి ఏడాది క్రితం చేరారు. ఈ క్రమంలో బాలిక కోసం జార్ఖండ్ పోలీసులు వెతుకుతూ గుర్రంకొండకు చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో బాలిక తరిగొండ వద్ద ఉన్నట్లు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికతో పాటు యువకుడిని తీసుకెళ్లారు.
వివరాలు సేకరిస్తాం..
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలి పనులు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తాం. మేస్త్రీలను స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరిస్తాం. బయట వ్యక్తుల వివరాలను సేకరించి తగు జాగ్రత్తలు తీసుకొంటాం.
- రవీంద్ర, ఎస్‌ఐ