మన మత్స్య సంపద మనకే
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:16 AM
మన మత్య్స సంపద.. మన మత్య్సకారులకే దక్కాలి. మన రాష్ట్ర సముద్రజలాల్లోకి ఇతర రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా అడ్డుకుంటాం
నాయుడు పేట/తడ/దొరవారిసత్రం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ‘మన మత్య్స సంపద.. మన మత్య్సకారులకే దక్కాలి. మన రాష్ట్ర సముద్రజలాల్లోకి ఇతర రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా అడ్డుకుంటాం. ప్రధానంగా పులికాట్ సరస్సులో చొరబాట్లను సహించం. ఇందుకోసం నిఘా పెడుతున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించాక, అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.
నిఘాను గాలికొదిలేసిన వైసీపీ
సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం మన బలం. అయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిఘాను గాలికొదిలేశారు. దీన్ని ఆసరాగా తీసుకుని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు పెద్ద బోట్లతో మన సరిహద్దుల్లో వేట సాగిస్తున్నారు. దాంతో మన మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై దీన్ని అడ్డుకుంటాం. నిఘా కోసం ఇప్పుడే రెండు బోట్లు ఇచ్చాం. ఒక్కోదానికి రూ.1.50 కోట్లు అవుతుంది. ఇంకా మూడు, నాలుగు ఇచ్చి మత్స్యకారులను ఆదుకుంటాం. తిరుపతి, నెల్లూరు కలెక్టర్లు కూడా మన జలాల్లోకి ఇతరులు రాకుండా నిఘాను పటిష్ఠం చేయాలి. ఇప్పటికే వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచాం. 1.29 లక్షల కుటుంబాలకు దీన్ని వర్తింపజేశాం. ఇక చెరువుల్లో మత్స్యకారులు చేపలు పట్టుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వేరే వాళ్లకు ఇచ్చింది. మేమొచ్చాక తిరిగి మత్స్యకారులకు అప్పగించాం.
రిజిస్ర్టేషన్ సేవలు బాగోలేదు..
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 44 సేవలకు సంబంధించి విశ్లేషించాం. ఇందులో రిజిస్ర్టేషన్ శాఖకు ప్రజలు అనుకూలంగా ఓటు వేయలేదు. చాలా లోపాలు ఉన్నాయి.. సరిచేసుకోవాలి. ఒక్క రూపాయి అవినీతి జరగడానికి వీల్లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలు తక్కువ రేటింగ్ ఉంది. బీసీ సంక్షేమ హాస్టళ్లు మరింత మెరుగుపర్చుకోవాలి. రేషన్ పంపిణీ, ఎన్టీఆర్ భరోసా స్కీమ్‌లలో కొద్దిగా మైనస్ ఉన్నారు. గంజాయిపై యుద్ధం లోపం ఉంది. ఇక్కడ సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీ గుర్తుపెట్టుకోవాలి. వీధి దీపాలు నివేదికలు సరిగ్గా రాలేదు. ఇంటింటికీ చెత్త సేకరణలో బలహీనంగా ఉన్నారు. మున్సిపల్ పాలనలో బలహీనంగా ఉంది. నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు చెరువుల్లో నీళ్లు విషయంలో జిల్లా కంటే తక్కువగా ఉన్నారు. మౌలిక వసతుల కల్పనలో అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి.