Share News

గ్యాస్‌ డిమాండ్‌తో వంట చెరకుకు పెరిగిన ఆర్డర్లు

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:49 AM

అటవీ శాఖ అనుమతులు లేకుండా పచ్చని వృక్షాలు కూల్చడం, అక్రమంగా తరలించడం, ఇదేమని ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకుల రెకమండేషన్‌ ఉందంటూ రుబాబు చేయడం మదపపల్లె మండలంలో పరిపాటిగా మారింది.

గ్యాస్‌ డిమాండ్‌తో వంట చెరకుకు పెరిగిన ఆర్డర్లు
కొత్తపల్లె వద్ద కలపను లారీకి లోడ్‌ చేస్తున్న కూలీలు

మదనపల్లె టౌన్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ అనుమతులు లేకుండా పచ్చని వృక్షాలు కూల్చడం, అక్రమంగా తరలించడం, ఇదేమని ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే అధికార పార్టీ నాయకుల రెకమండేషన్‌ ఉందంటూ రుబాబు చేయడం మదపపల్లె మండలంలో పరిపాటిగా మారింది. వాల్టా యాక్టు ప్రకారం ఎక్కడైనా చెట్లు తొలగించాలన్నా రెవిన్యూ అధికారుల నుంచి కటింగ్‌ ఆర్డర్‌ తెచ్చుకోవాలి. కూలిపోయే స్థితిలో ఉన్న వాటికి, అభివృద్ధి పనులకు అడ్డు వచ్చే చెట్లను తొలగించడానికి తహసీల్దార్‌ నుంచి కటింగ్‌ ఆర్డర్‌ తీసుకోవాలి. కూల్చిన చెట్ల కలపను తరలించాలంటే తప్పనిసరిగా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ మదనపల్లె మండలంలో మాత్రం ఇవేమి లేకుండా దర్జాగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లె గ్రామం వద్ద పొలంలోని పదుల సంఖ్యలో కానుగ, చింత, వేప చెట్లను నరికేసి, వాటిని ముక్కలు చేసి లారీకి లోడ్‌ చేస్తుండటంపై గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడి అనుచరుడి కుమారుడినని, తమకు అన్నీ తెలుసునని, అన్ని పర్మిషన్లు ఉన్నాయని గ్రామస్తులను దబాయించారు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌వో జయప్రసాదరావు, పెంచుపాడు ఎఫ్‌బీవో దీప, డీఆర్‌వో శివరంజనిలను కొత్తపల్లెకు పంపి విచారించారు. రెండు లారీలకు సరిపడా కలప, వంటచెరకు అక్కడ ఉండటం గమనించి, ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అధికారులు ఈ లారీలను సీజ్‌ చేస్తారో రెకమండేషన్‌ ఉందంటూ వదిలేస్తారో చూడాల్సి ఉంది.

కట్టెల పొయ్యికి పెరిగిన డిమాండ్‌

ఇటీవల కమర్షియల్‌ గ్యాస్‌కు డిమాండ్‌ ఏర్పడటంతో కట్టెల పొయ్యికి గిరాకి పెరిగింది. చాలావరకు హోటళ్లలో ఇప్పుడు కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా చెట్లను నరికివేసి కలప, వంటచెరుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 01:49 AM