Share News

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు చూడాల్సిందే

ABN , Publish Date - Feb 04 , 2026 | 02:19 AM

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లు ఇకపై ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఓపీలను చూడాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీలు చూడాల్సిందే
తిరుపతి రుయాస్పత్రి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు

పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా సీఎ్‌సఆర్‌ఎంవో

తిరుపతి సిటీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లు ఇకపై ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఓపీలను చూడాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమకు తలమానికమైన తిరుపతి రుయాస్పత్రిలో దాదాపు 43 విభాగాలు ఉన్నాయి. బోధన ఆస్పత్రి కావడంతో ఇక్కడకు వివిధ వైద్యసేవల నిమ్తితం రోజుకు దాదాపు 2,000 నుంచి 2,500 మంది రోగులు వస్తుంటారు.

సమయపాలన పాటించని డాక్టర్లు

రుయా ఆస్పత్రిలో కొందరు డాక్టర్లు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు ఎక్కువగా మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీ, గుండె, న్యూరాలజీ, ఆర్థోపెడిక్‌, ఆర్థోపెడిక్‌ సర్జరీ, గైనిక్‌, ఆప్తమాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, క్యాన్సర్‌ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారు. వైద్యులు ఎక్కువగా మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటలకే ఓపీ క్లోజ్‌ చేసేసి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు వైద్యులైతే భోజన విరామం పేరుతో ఇళ్లకు వెళ్లి, సొంత వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీనివల్ల రుయాలో ఉచిత వైద్య సేవలు తూతూ మంత్రంగా తయారయ్యాయి. ఈ క్రమంలో ఇకపై ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపీలు చూడాల్సిందేనని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధకు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు మెమోలను వైద్యశాఖ జారీ చేసింది. వారు అన్ని విభాగాల డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత సమయం వరకు ఓపీలు చూడలేదన్న ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది దశలవారీగా భోజనానికి వెళ్లి రావాలని సూచించారు. రోగులకు అందే సేవల్లో అంతరాయం కల్గకూడదని స్పష్టం చేశారు. అలాగే ఓపీల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిగా సీఎ్‌సఆర్‌ఎంవోను నియమించారు.

Updated Date - Feb 04 , 2026 | 02:19 AM