Share News

గృహగణనకు మిగిలిందిక రెండు రోజులే

ABN , Publish Date - May 30 , 2026 | 12:51 AM

జన గణనలో మొదటి విడత కార్యక్రమం గృహగణనకు ఆదివారంతో గడువు ముగియనుంది. జిల్లాలో 3039 బ్లాకులు గుర్తించగా ఇప్పటివరకు 1451 బ్లాకుల్లో వందశాతం సర్వే పూర్తయింది.

గృహగణనకు మిగిలిందిక రెండు రోజులే
పెద్దపంజాణి మండలం బొమ్మనకుంట గ్రామంలో గణన తనిఖీ పరిశీలిస్తున్న ఎంపీడీవో

ఇప్పటికి 6.08 లక్షల ఇళ్ల లెక్క పూర్తి

పూర్తి కావచ్చిన సర్వే

జన గణనలో మొదటి విడత కార్యక్రమం గృహగణనకు ఆదివారంతో గడువు ముగియనుంది. జిల్లాలో 3039 బ్లాకులు గుర్తించగా ఇప్పటివరకు 1451 బ్లాకుల్లో వందశాతం సర్వే పూర్తయింది. మిగిలిన 1588 బ్లాకుల్లో సర్వే వివిధస్థాయిల్లో కొనసాగుతోంది. ఇక, త్వరలో జనగణనల మొదలుకానుంది.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5,92,779 ఇళ్ల వివరాల సేకరణ లక్ష్యంగా అధికారులు సర్వే ప్రారంభించారు. ఈ ఇళ్లను 2773 బ్లాకులుగా విభజించి గణన చేపట్టారు. ఇంటికి తాళాలు వేసిన ఇళ్ల వివరాలు తప్ప మిగతావాటి ప్రక్రియ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు వీటి వివరాల కోసం మళ్లీ ప్రయత్నిస్తారు. ఇక, జిల్లాలో 27 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 5,09,077 ఇళ్లుండగా (ప్రస్తుత రికార్డులో ఈ సంఖ్య ఉండగా, తర్వాత క్షేత్రస్థాయిలో మరిన్ని ఇళ్లు పెరిగాయి). శుక్రవారం వరకు 102.93 శాతం అనగా 5,23,972 ఇళ్లను సర్వే చేశారు. ఈ ఇళ్ళ పరిధిలో 16,87,119 మంది జనాభా ఉండగా, శుక్రవారం నాటికి 89.74 శాతం అనగా 15,13,942 మంది సర్వే జరిగింది. ఇక, చిత్తూరు నగరపాలక పరిధిలో 83,702 ఇళ్లకుగాను శుక్రవారం నాటికి 84,268 ఇళ్ల (100.68 శాతం) సర్వే పూర్తయింది. ఈ ఇళ్లల్లో 2,04,771 మంది జనాభా ఉండగా, ఇప్పటివరకు 97.33 శాతం అనగా 1,99,296 మంది సర్వే పూర్తిచేశారు.

స్వీయ గణనతో ఇబ్బందులు

ఈసారి జనగణనలో కేంద్రప్రభుత్వం నేరుగా ప్రజలే తమ వివరాలు వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ప్రక్రియకు జిల్లా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నమోదు చేసుకున్న వారి వివరాలు సైతం పారదర్శకంగా లేకపోవడం, జియోగ్రాఫిక్‌ లొకేషన్‌ మ్యాచ్‌ అవ్వకపోవడంతో లాగిన్‌ అవుతున్న సిబ్బంది ప్రక్రియ మొత్తం మొదటి నుంచి చేయాల్సి వస్తుంది.

ఆ ఇళ్లను ఏం చేస్తారు?

జిల్లాలో తాళం వేసిన ఇళ్లు 2507 ఉన్నట్లు నమోదు చేశారు. పిల్లల చదువులు, ఉద్యోగాలరీత్యా సమీప పట్టణాల్లో ఉంటూ వేసవి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారు ఇందులో ఉన్నారు. మరికొందరు ప్రస్తుతం తాము నివాసం ఉంటున్న ఇళ్లు తమవి కావని, తమ వివరాలను సొంత గ్రామాల్లో నమోదు చేయించుకుంటామని చెప్పడంతో వాటిని ఎలా నమోదు చేయాలో అర్థంకాక, వెబ్‌పోర్టల్‌లో ఐచ్ఛికం (ఆప్షన్‌) లేక లాక్డ్‌ హౌస్‌గా నమోదు చేస్తున్నారు. జనగణనలో మళ్లీ అక్కడికి వెళ్లి జనాభా వివరాలు సేకరిస్తారని అధికారులు తెలిపారు.

ఇది పునాది మ్రాతమే

జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న గృహగణన ప్రక్రియ జనగణనకు పునాది వంటిది. ప్రస్తుతం జిల్లాలోని ప్రతి ఇంటికి ప్రత్యేక నెంబరు ఇచ్చి, వాటిని మ్యాపింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఇది దాదాపుగా పూర్తికావొచ్చింది. మిగిలినవాటిని ఉన్న రెండురోజుల్లో పూర్తిచేస్తాం. తాళాలు వేసినవిగా నమోదు చేసిన వాటి వివరాలు జనగణనలో ప్రత్యేక డ్రైవ్‌లో పూర్తిచేస్తాం.

- కె.మోహన్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి, చిత్తూరు.

ఇదీ లెక్క

జిల్లాలో మొత్తం ఇళ్లు: 5,92,779

శుక్రవారానికి పూర్తయిన గణన: 6,08,240 ఇళ్లు (102.61 శాతం)

మొత్తం జనాభా: 18,91,890

ఇప్పటికి గణన పూర్తయింది: 17,13,238 (90.67శాతం)

ఖాళీ ఇల్లు: 76,846

మూతబడ్డ ఇల్లు: 2507

ఫ గృహ గణన సర్వేలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన మండలాలు: చిత్తూరు రూరల్‌ 113.2 శాతం, గుడిపాల 105.0 శాతం, రొంపిచెర్ల 99.9 శాతం

చివరిస్థానంలో నిలిచినవి: నగరి మున్సిపాలిటీ 77.5శాతం, శాంతిపురం 79.4 శాతం, పాలసముదద్రం 80.2 శాతం

Updated Date - May 30 , 2026 | 12:51 AM