కలెక్టరేట్లో ఇక 85 మందే
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:46 AM
రెగ్యులర్ పోస్టులు 53, అవుట్ సోర్సింగ్ 32 అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం
చిత్తూరు కలెక్టరేట్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ మొదలు చివరి పోస్టు అయిన వాచ్‌మ్యాన్ వరకు ఇకపై 85 మందే ఉంటారు. ఇందులోనూ 53 మంది రెగ్యులర్, 32 పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 150 నుంచి 200 మంది సిబ్బంది ఉండేవారు. జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికారులు, సిబ్బంది పోస్టులను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఒకే ఫార్మెట్‌లో అధికారులు, సిబ్బంది సంఖ్య ఉంటుంది.
కలెక్టరేట్‌లో రెగ్యులర్ పోస్టుల్లోని ప్రధాన అధికారుల్లో కలెక్టర్, జేసీ, డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఏవో ఉంటారు. కార్యాలయ సిబ్బందిలో సూపరింటెండెంట్ / తహసీల్దార్లు నలుగురు, డీటీలు 16 మంది, సీనియర్ అసిస్టెంట్లు 16 మంది, జూనియర్ అసిస్టెంట్లు 10 మంది, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక జమేదార్ పోస్టులు ఉంటాయి. ఔట్‌సోర్సింగ్ విషయానికి వస్తే కంప్యూటర్ ఆపరేటర్లు 10 మంది, ఆఫీస్ సబార్డినేట్‌లు/ అటెండర్లు 16 మంది, డ్రైవర్లు నలుగురు, ఇద్దరు వాచ్‌మెన్ చొప్పున ఉంటారు. కాగా, ఏ పోస్టులు రద్దవుతాయి? రెగ్యులర్ ఉద్యోగులు ఎందరు ఉన్నారు? ఎన్ని పోస్టులు ఖాళీ? ఎన్ని పోస్టులు ఎక్కువ? వాటిలో రద్దయినవి ఏవి తదితర వివరాలను జిల్లా యంత్రాంగం సేకరిస్తోంది. త్వరలో వీటిని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ పరిధిలోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ అధికంగా, తక్కువగా ఉన్న వివరాలను సేకరిస్తున్నామని డీఆర్వో మోహన్ కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. త్వరలో పూర్తి వివరాలు అందుతాయన్నారు.
పని భారం ఎక్కువ
ప్రభుత్వ.. సాధారణ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఎక్కువ పని ఉంటుంది. వీటికి తోడు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర-2047, ఇతర అనేక కార్యక్రమాలకు సంబంధించి పనిభారం కూడా పరోక్షంగా కలెక్టరేట్ మీద పడుతుంది. ఈ పనిభారానికి తగ్గట్టుగా తగిన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం కూడా అనుకున్న లక్ష్యాలను సకాలంలో చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్, అర్జీల మీద నిర్ణీత సమయంలో పర్యవేక్షణ వంటివి గాడి తప్పుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోర్టు కేసులు, ప్రొటోకాల్ విధులు, అప్పుడప్పుడు వచ్చే ఎన్నికల నిర్వహణ, విపత్తుల నిర్వహణ వంటివి అదనపు భారాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం జనగణన, ‘సర్’ వంటివి కూడా నడుస్తున్నాయి.