ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు వచ్చింది 52 దరఖాస్తులే
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:32 AM
గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో భిన్న పరిస్థితి నెలకొంది.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో భిన్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సెప్టెంబరు 5వ తేదీన 70 మంది టీచర్లను ఎంపిక చేసి సన్మానించాలని అధికారులు భావించారు. నిబంధనలు అనుసరించి ఉత్తమ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరగా, 52 మంది టీచర్లు పంపారు. ఈ దరఖాస్తులను జ్యూరీ (న్యాయ నిర్ణేతలు) కమిటీ సభ్యులు పరిశీలించి, అర్హులను ఎంపిక చేయనున్నారు. ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని భావించి విద్యాశాఖ, అనుబంధ విభాగానికి సంబంధించిన అధికారులు వారికి అనుకూలమైన కొంత మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఇది విద్యాశాఖలో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఈ ప్రక్రియను డీఈవో లక్ష్మీనారాయణ ఆపేయించారు. దీంతో అవార్డులకు దరఖాస్తు చేసుకోని ప్రతిభావంతులైన కొందరు టీచర్ల పేర్లను సూచించాలని ఏపీసీ, డీవైఈవోలను ఆదేశించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 39 మందిని ఎంపిక చేశారు. వీరికి బుధవారం డీఈవో లక్ష్మీనారాయణ అధ్యక్షతన జ్యూరీ (న్యాయ నిర్ణేతలు) మెంబర్లుగా డీవైఈవో ఇందిరతో పాటు మరో ఇద్దరు ఎంఈవోలు, ఇద్దరు హెచ్‌ఎంలు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘మీ కేరీర్ గురించి చెప్పండి? గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులోని అంశాలు వివరించండి. ల్యాబ్‌లు లేకుంటే ఎలా బోధిస్తారు? సైన్స్ సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం తగ్గిపోడానికి కారణమేంటి? సీ, డీ గ్రేడ్ విద్యార్థుల పట్ల మీరు ఎలా దృష్టి సారిస్తారు?’ అంటూ వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఈ ఇంటర్వ్యూలపై కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘మేము అవార్డుకోసం దరఖాస్తు చేసుకోకున్నా.. అధికారులే ప్రతిభావంతులుగా గుర్తించారు. మళ్లీ ఈ ఇంటర్వ్యూలు ఏమిటి? ఇలా పలు రకాలైన ప్రశ్నలు వేసి, మా స్థాయిని తగ్గించడం సరికాదు’ అని పేర్కొన్నారు.