భక్తులకు ‘ఆన్‌లైన్’ ఇక్కట్లు
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:07 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే విధానాన్ని ఆరు నెలలుగా దశలవారీగా అమలు చేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే విధానాన్ని ఆరు నెలలుగా దశలవారీగా అమలు చేశారు. ఇంతవరకు బాగానే ఆన్‌లైన్‌పై అవగాహన లేని భక్తులకు ఆలయం వద్ద అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీనివల్ల భక్తుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక భక్తుల సౌకర్యార్థం పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా.. ఆన్‌లైన్ ప్రక్రియ అమలుకు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. కొద్దినెలల ముందుగానే వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆలయం వద్ద టిక్కెట్ వెండింగ్ యంత్రాలను ముందుగానే ఏర్పాటు చేసి భక్తులు స్వయంగా బుక్ చేసుకునే ఏర్పాటు కూడా కల్పించారు. వారం రోజులుగా పూర్తిగా ఆన్‌లైన్ బుకింగ్‌లు జరిపేలా కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. దీనివల్ల ఆయా కౌంటర్లలో టిక్కెట్లను జారీ చేయడం నిలిపేశారు. దీనిపై అవగాహన లేకుండా ఆలయం వద్దకొచ్చే భక్తులు వెండింగ్ యంత్రాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. ఈ యంత్రాల వద్ద సిబ్బంది ఎవరినీ కేటాయించక పోవడం గమనార్హం. కనీసం సమస్య తలెత్తితే సమాధానం చెప్పేవారూ లేరని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కౌంటర్లలో పనిచేస్తుండిన సిబ్బందినైనా ఇక్కడ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.