Share News

కుప్పంలో ఏకపక్షం

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:53 AM

కుప్పం మున్సిపల్‌ ఓటర్ల తీర్పు టీడీపీకి ఏకపక్షంగా ఉంది. చైర్మన్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కుప్పం మున్సిపల్‌ టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు 72.43 శాతం ఓట్లు పోలయ్యాయి.

కుప్పంలో ఏకపక్షం

టీడీపీకి ఓటేసిన 72.43 శాతం

చిత్తూరు మేయర్‌కు 66.91.. పలమనేరులో 53.98

చిత్తూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపల్‌ ఓటర్ల తీర్పు టీడీపీకి ఏకపక్షంగా ఉంది. చైర్మన్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కుప్పం మున్సిపల్‌ టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు 72.43 శాతం ఓట్లు పోలయ్యాయి. పలమనేరులో మాత్రం టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మికి 53.98 శాతమే ఓట్లు పోలయ్యాయి. చిత్తూరులో టీడీపీ తరఫున మేయర్‌గా గెలిచిన కటారి హేమలతకు 66.91 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థులకు.. పలమనేరులో 42.77 శాతం.. చిత్తూరులో 29.66.. కుప్పంలో 22.69 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

టీడీపీకి 64.86 శాతం ఓట్లు

మేయర్‌, చైర్మన్ల అభ్యర్థులకు పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. టీడీపీకి ఓటర్లు బ్రహ్మరథం పడ్డారని తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో ఏకంగా 64.86 శాతం టీడీపీ ఖాతాలో పడ్డాయి. మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ ఎన్నికకు 1,55,132 ఓట్లు పోలవ్వగా.. 1,00,628 ఓట్లు టీడీపీ అభ్యర్థులకు పడ్డాయి. అలాగే 47,501 ఓట్లతో 30.62 శాతం వైసీపీ అభ్యర్థులకు లభించాయి.

వార్డుల వారీగా చూస్తే టీడీపీకి 59 శాతం

ఇక, ఎన్నికలు జరిగిన డివిజన్లు, వార్డులను చూస్తే.. టీడీపీ అభ్యర్థులకు ఏకంగా 59 శాతం ఓట్లు పోలయ్యాయి. చిత్తూరులో ఎన్నిక జరిగిన 9 డివిజన్లలో 14,249 ఓట్లు పోలైతే 5,664 ఓట్లు టీడీపీ అభ్యర్థులకు, 4326 వైసీపీ, 2344 జనసేనకు పడ్డాయి. కుప్పంలో 19, పలమనేరులో 30, నగరిలో 36 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా వార్డుల్లో 90,138 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థులకు 53,228 ఓట్లు, వైసీపీకి 31,530, జనసేనకు 3,333, బీజేపీకి 730 ఓట్లు పడ్డాయి.

మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలైన ఓట్లు.. పార్టీల వారీగా

మున్సిపాలిటీ పోలైన ఓట్లు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ

చిత్తూరు 14249 5664 4326 2344 209

కుప్పం 18958 12852 4758 - -

పలమనేరు 22865 14680 9686 510 378

నగరి 34066 20032 12760 479 143

మొత్తం 90138 53228 31530 3333 730

శాతం 59 34.9 3.69 0.80

Updated Date - Nov 05 , 2026 | 12:53 AM