ఒక బదిలీ.. మూడు జీవోలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:02 AM
చిత్తూరు డీఎంహెచ్‌వో సుధారాణి బదిలీకి సంబంధించి బుధవారం ముచ్చటగా మూడో జీవో జారీ అయింది. ఇందులో ఆమెను విజయవాడలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వద్ద రిపోర్టు చేసుకోవాలని పేర్కొనడంతో బదిలీపై స్పష్టత వచ్చింది.
చిత్తూరుకు నాగ శశిభూషణ్‌రెడ్డి నియామకం
చిత్తూరు రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు డీఎంహెచ్‌వో సుధారాణి బదిలీకి సంబంధించి బుధవారం ముచ్చటగా మూడో జీవో జారీ అయింది. ఇందులో ఆమెను విజయవాడలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ వద్ద రిపోర్టు చేసుకోవాలని పేర్కొనడంతో బదిలీపై స్పష్టత వచ్చింది. ఆమె స్థానంలో నాగ శశిభూషణ్ రెడ్డిని డీఎంహెచ్‌వోగా నియమించారు. చిత్తూరులోనే కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో కొంత మంది డీఎంహెచ్‌వోలను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో చిత్తూరు డీఎంహెచ్‌వోగా అనంతపురం జిల్లా డీఐవో నాగ శశిభూషణ్‌రెడ్డిని నియమించారు. అయితే, చిత్తూరు డీఎంహెచ్‌వో సుధారాణికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. హెడ్ ఆఫీసులోనూ రిపోర్టింగ్ చేసుకోమని సూచించలేదు. దీంతో ఆ బదిలీకి బ్రేక్ పడింది.
చిత్తూరు డీఎంహెచ్‌వో బదిలీకి సంబంధించే సోమవారం (మార్చి 23) మరో ఉత్తర్వు జారీ అయింది. ఈ జీవోలోనూ నాగ శశిభూషణ్ రెడ్డిని జిల్లాకు డీఎంహెచ్‌వోగా బదిలీ చేయగా.. ఇక్కడ పనిచేస్తున్న సుధారాణి విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
తాజాగా బుధవారం వెలువడిన మూడో జీవోలో సుధారాణిని హెడ్ ఆఫీసులో రిపోర్టు చేసుకోవాలని స్పష్టతనిచ్చారు. ఆమె స్థానంలో నాగ శశిభూషణ్ రెడ్డిని నియమించారు. ఇలా నెల రోజులకుపైగా ఒక బదిలీ.. మూడు జీవోల వ్యవహారం సాగింది.
పెండింగ్ బిల్లుల మాటేమిటి?
డీఎంహెచ్‌వో సుధారాణి ఉగాది నుంచి కార్యాలయానికి రావడం లేదని సమాచారం. ఆమె సెలవు పెట్టలేదు. మరొకరికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వలేదు. దీంతో బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరో ఐదు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పుడు ఆమె బదలీ అయ్యారు. కొత్త డీఎంహెచ్‌వో ఎప్పుడు బాధ్యతలు చేపడతారో తెలియదు. ఈ క్రమంలో మంజూరైన నిధులు వెనక్కి పోతాయేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.