ఇప్పటికే లక్ష టన్నుల తోతాపురి కొనుగోళ్లు
ABN , Publish Date - Jun 19 , 2026 | 01:12 AM
జిల్లాలో ఇప్పటివరకు లక్ష టన్నుల తోతాపురి రకం మామిడి కాయలను రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు లక్ష టన్నుల తోతాపురి రకం మామిడి కాయలను రైతుల నుంచి గుజ్జు ఫ్యాక్టరీలు కొనుగోలు చేశాయని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కృష్ణగిరి, శ్రీనివాసపురం మార్కెట్లలో ప్రస్తుతం తోతాపురి ధరలు తక్కువగా ఉన్నాయని, ఆ ధరలు జిల్లాలో ప్రభావితం చేస్తున్నట్లు ఆయన అంగీకరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల రోజులుగా ఎగుమతిదారులు, ప్రాసెసింగ్, బాట్లింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. దిండుక్కల్, క్రిష్ణగిరి, చిత్తూరు, శ్రీనివాసపురం మార్కెట్లలో తోతాపురి కిలో రూ.5 - రూ.6 మధ్య ధర ఉందన్నారు. ధరలు తగ్గడానికి ప్రధాన కారణం మార్కెట్‌లో డిమాండ్ తగ్గడమేనని అభిప్రాయపడ్డారు. తమ వద్ద ఫిబ్రవరి వరకు అవసరమైన మామిడి గుజ్జు నిల్వలు ఉండటంతో ఇప్పుడు కొనగోళ్లపై దృష్టిపెట్టలేదని కోకోకోలా, పెప్సీ తదితర కంపెనీల ప్రతినిధులు చెప్పారన్నారు. సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాలకు మామిడి ఎగుమతులు తగ్గడం కూడా కొనుగోళ్లపై ప్రభావం పడిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రాసెసర్లు రైతులకు గిట్టుబాటు ధర చెల్లింపులో అనుకూలంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని ఫ్యాక్టరీలు తక్కువ ధర ప్రకటించడం వల్ల మార్కెట్‌పై ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో ఈ అంశంపై రోజూ సమీక్షిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. రాబోయే 10 రోజుల్లో నిల్వలు తగ్గి, వినియోగం పెరగడం వల్ల ధరలు కొంత మెరుగుపడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.