Share News

డెమో రైలు ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - May 05 , 2026 | 12:20 AM

మతిస్థిమితం కోల్పోయి పుల్లంపేట మండలం అనంతంపల్లె వద్ద అడ్డుపడిన మహేష్‌ అనే వ్యక్తిని ఓబులవారిపల్లె స్టేషన్‌ వరకు రైలు ఈడ్చుకుని వచ్చిన విషాద ఘటన ఇది.

డెమో రైలు ఢీకొని ఒకరి మృతి
రైలుకింద పడి మృతిచెందిన మహేష్‌

ఓబులవారిపల్లె, మే 4 (ఆంధ్రజ్యోతి) : మతిస్థిమితం కోల్పోయి పుల్లంపేట మండలం అనంతంపల్లె వద్ద అడ్డుపడిన మహేష్‌ అనే వ్యక్తిని ఓబులవారిపల్లె స్టేషన్‌ వరకు రైలు ఈడ్చుకుని వచ్చిన విషాద ఘటన ఇది. పుల్లంపేట మండలం కేతరాజుపల్లె దళితవాడకు చెందిన పులియాల మహేష్‌(38) మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు.ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం అనంతంపల్లె రైల్వేరోడ్డు ప్రాంతంలో ముళ్ల పొదల నుంచి తిరుపతి వైపు వెళుతున్న నంద్యాల డెమో రైలుకు ముందుభాగాన దూరడంతో పదునైన కొక్కీకి మెడ చిక్కుకుని మృతిచెందాడు. ట్రైన్‌ను సడన్‌గా ఆపే అవకాశం లేకపోవడంతో ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్‌ వరకు ఈడ్చుకు వచ్చింది. ఈ క్రమంలో మహేష్‌ కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం ఇచ్చి శవాన్ని పక్కకు తీశారు. ఈ క్రమంలో మహేష్‌ బంధువులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.ఆయన భార్య బతుకుదెరువుకోసం గల్ఫ్‌ వెళ్లిందని మరో మూడు రోజుల్లో ఇంటికి వచ్చేందుకు సిద్ధమైందని బంధువులు తెలిపారు. వారికి ముగ్గురు పిల్లలున్నారని సమాచారం. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రైలు సుమారు గంట ఆలస్యంగా నడిచింది.

Updated Date - May 05 , 2026 | 12:20 AM