ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:28 AM
‘వికసిత్ వైబ్రెంట్ విలేజ్’ కార్యక్రమంలో ప్రధానితో వర్చువల్‌గా మాట్లాడిన భవ్యశ్రీ
చిత్తూరు కలెక్టరేట్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘వివిధ రాష్ట్రాల యువతతో కలసి మమేకమయాయ. అదే ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్.. స్ఫూర్తికి నిదర్శనం’ అని చిత్తూరుకు చెందిన యువతి భవ్యశ్రీ అన్నారు. దేశవ్యాప్తంగా 250 జిల్లాలకు చెందిన యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యాన వర్చువల్‌గా జరిగిన ‘వికసిత్ వైబ్రెంట్ విలేజ్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘చదువుతోపాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో మై భారత్ వేదికలో చేరా. వివిధ క్విజ్‌లలో పాల్గొనడం ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమానికి ఎంపికయ్యా. ఉత్తరాఖండ్‌లోని హర్షిల్ లోయకు భయంతో వెళ్లగా.. అక్కడి ప్రజలు, అధికారులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి భయాన్ని తొలగించారు. అక్కడ ఐదు డిగ్రీల చలి ఉన్నా.. అధికారులు ఇచ్చిన గ్లోవ్స్, టోపీలు, ఉన్ని దుస్తులు ధరించడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు’ అని భవ్యశ్రీ వివరించారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉండటమని వాళ్లను అడగ్గా.. ‘ఇది మా స్వస్థలం. మేము భయపడి వెళ్లిపోతే ఇక్కడ ఎవరు ఉంటారని వారు చెప్పిన మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేసింది’ అని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ నుంచి వికసిత్ వైబ్రెంట్ విలేజ్ వరకు యువత ఉత్సాహంతో పాల్గొని తమ సామర్థ్యాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. దేశ భద్రత పట్ల సరిహద్దు గ్రామాల ప్రజల ఆలోచన, దేశంతో వారి అనుబంధాన్ని యువత అర్థం చేసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తుందన్నారు. భవ్యశ్రీలో కనిపించిన ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ఇతర యువతకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని అభినందించారు.