Share News

ఒక డివిజన్‌ టీడీపీకి ఏకగ్రీవం

ABN , Publish Date - Oct 19 , 2026 | 02:14 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు గడువు ముగిసే సరికి తిరుపతి మేయర్‌ సహా నాయుడుపేట, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్ల స్థానాలకు అన్నింటికీ కూటమి, వైసీపీ పార్టీల నుంచీ నామినేషన్లు దాఖలయ్యాయి.

ఒక డివిజన్‌ టీడీపీకి ఏకగ్రీవం

మేయర్‌కు 36... డివిజన్లకు 449 నామినేషన్లు

సూళ్ళూరుపేటలో ఛైర్మన్‌కు 10... వార్డులకు 162

నాయుడుపేటలో ఛైర్మన్‌కు 14... వార్డులకు 142

వెంకటగిరిలో ఛైర్మన్‌కు 9... వార్డులకు 216

పుత్తూరులో ఛైర్మన్‌కు 11... వార్డులకు 263

పురపోరులో ముగిసిన కీలకఘట్టం

తిరుపతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు గడువు ముగిసే సరికి తిరుపతి మేయర్‌ సహా నాయుడుపేట, సూళ్ళూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్ల స్థానాలకు అన్నింటికీ కూటమి, వైసీపీ పార్టీల నుంచీ నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే తిరుపతి నగర కార్పొరేషన్‌లో మాత్రం 19 డివిజన్లకు వైసీపీ నుంచీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.ఆదివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఘర్షణలు జరుగుతాయని భావించినా జిల్లావ్యాప్తంగా ఎక్కడా చెప్పుకోదగ్గ ఘటనలేవీ జరగలేదు. తిరుపతిలో మేయర్‌ స్థానానికి 36 నామినేషన్లు దాఖలు కాగా 66 డివిజన్లకు గానూ 449 నామినేషన్లు వచ్చాయి. 12వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి చక్రీ రాయల్‌ ఒకరే నామినేషన్‌ వేయడంతో అది టీడీపీకి ఏకగ్రీవమైనట్టు అయింది. దీంతో సహా మొత్తం 19 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. 12వ డివిజన్‌ మినహాయిస్తే వైసీపీ బరిలో లేని మిగిలిన 18 డివిజన్లు కూడా కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర మున్సిపాలిటీల విషయానికొస్తే సూళ్ళూరుపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి 10 నామినేషన్లు దాఖలు కాగా 32 వార్డులకు 162 నామినేషన్లు వచ్చాయి. నాయుడుపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి 14 నామినేషన్లు వచ్చాయి. అక్కడ 32 వార్డులకు గానూ 140 నామినేషన్లు ఫైలయ్యాయి. వెంకటగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా 36 వార్డులకు కలిపి 216 నామినేషన్లు వచ్చాయి. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానానికి 11 నామినేషన్లు అందగా 36 వార్డులకు గానూ 263 నామినేషన్లు వచ్చాయి. ఈ మున్సిపాలిటీల్లో అటు ఛైర్మన్‌ పదవులకు, ఇటు వార్డు స్థానాలకు కూడా కూటమి, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్ర్కూటినీ అనంతరం నామినేషన్లు చెల్లుతాయా లేదా అన్నది తేలుతుందనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే మున్సిపాలిటీలలో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోయింది.

తిరుపతిలో 20కిపైగా ఏకగ్రీవం!

అభ్యర్థుల నామినేషన్లను సోమవారం అధికారులు పరిశీలించను న్నారు.నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వరకు గడువుండడంతో ఆ తర్వాతే పోటీలో మిగిలే అభ్యర్థులపై స్పష్టత రానుంది.స్ర్కూట్నీ తర్వాత 20మందికి పైగా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది.మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఏ వార్డులో ఎవరెవరు బరిలో నిలుస్తారు? ఎన్ని వార్డుల్లో ఏకగ్రీవాలు నమోదవుతాయి? ఎన్ని చోట్ల ప్రత్యక్ష పోటీ తప్పదన్న అంశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏకగ్రీవాల సంఖ్యపై తుది అంచనా రావాలంటే ఉపసంహరణ గడువు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

గోడ దూకి నామినేషన్‌

వైసీపీ మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ నాటకీయ పరిణామాల నడుమ ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నామినేషన్‌ దాఖలు చేశారు. పోలీసులను వెంటపెట్టుకుని వచ్చిన ఆయన కార్పొరేషన్‌ కార్యాలయం వెనుక గోడ దూకి లోపలికి వెళ్లారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత కరుణాకర రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌ పెద్దకాపులేఅవుట్‌ (21వ డివిజన్‌) నుంచి కూటమి అభ్యర్థిగా ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Oct 19 , 2026 | 02:14 AM