మరోసారి పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తుడిపై దాడి
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:28 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ భక్తుడిపై ఆదివారం మధ్యాహ్నం భద్రతా సిబ్బంది దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
తిరుచానూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఓ భక్తుడిపై ఆదివారం మధ్యాహ్నం భద్రతా సిబ్బంది దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం రేకెత్తించింది. విజయవాడకు చెందిన పృథ్వీ అనే భక్తుడు తన బ్యాగ్‌తోపాటు సెల్‌ఫోన్ తీసుకొచ్చాడు. స్కానింగ్ సెంటర్ వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అతడిని వారించి, సెల్‌ఫోన్‌ను వెలుపల కౌంటర్‌లో ఉంచి రమ్మన్నారు. భక్తుడు తన సెల్‌ఫోన్ డిపాజిట్ చేసి స్కానింగ్ సెంటర్ వద్ద వెలుపలకు వచ్చిన ఎంట్రీ వద్దకు వెళ్లి ఆలయంలోకి అనుమతించాలని, రైలుకెళ్లే సమయం అవుతోందని కోరాడు. దానికి అక్కడ విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది దురుసుగా మాట్లాడారు. అదేంటని భక్తుడు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భక్తుడిపై ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ గిరిధర్‌రెడ్డి దాడి చేయడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు చూసి నిర్ఘాంతపోయారు. ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రైవేటు సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది పృఽథ్వీని బలవంతంగా వెలుపలకు తోసేశారు. తనను ఎందుకు కొడతారని ఆవేదనకు గురైన ఆ భక్తుడు బోరున విలపించాడు.
ఆగ్రహం వ్యక్తం చేసిన సీవీఎస్వో
ఈ సంఘటనపై కలకలం రేగడంతో సీవీఎస్వో మురళీకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులతో సమన్వయంగా వ్యహరించాల్సిన భద్రతా సిబ్బంది దాడి చేయడం సరికాదన్నారు. ఎస్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ గిరిధర్‌రెడ్డిని తక్షణం అమ్మవారి ఆలయ డ్యూటీ నుంచి తప్పిస్తూ తక్షణమే శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు సీవీఎస్వో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఎందుకిలా..
అమ్మవారి ఆలయానికి మూడేళ్ల కిందట వరకు రోజుకు 20వేలమంది వచ్చేవారు. ఇపుడు ఆ సంఖ్య 40వేలకు చేరింది. నాలుగు నెలల కిందట కర్ణాటకకు హిజ్రా భక్తురాలిపై మహిళా జమేదారు దాడి చేశారు. ఆమెను సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టుకున్నారు. భక్తులకు తీర్థం, శఠారి ఇచ్చే పరిచారకుడు.. మహిళ భక్తురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని ప్రశ్నిస్తే సదరు కుటుంబంపై ఎదురుదాడి జరిగిన ఘటనలు ఉన్నాయి. ఆలయ విజిలెన్సు అధికారి పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి భక్తులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.