అయ్యో.. దేవుడా!
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:55 AM
పిల్లలంతా కలిసి వినాయక విగ్రహం పెడతామంటే సంతోషంగా చందాలిచ్చారు. మూడు రోజులుగా వాళ్లు చేసే పూజలు చూస్తూ సంతోషపడ్డారు. బుధవారం సాయంత్రం బడి నుంచి రాగానే నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లారా పిల్లలు. అలా వెళ్లిన వారిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బురదలో చిక్కుకుని అసువులు బాశారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ విషాద ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.
చెరువులోని బురదలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
వినాయక విగ్రహ నిమజ్జనంలో విషాదం
పిల్లలంతా కలిసి వినాయక విగ్రహం పెడతామంటే సంతోషంగా చందాలిచ్చారు. మూడు రోజులుగా వాళ్లు చేసే పూజలు చూస్తూ సంతోషపడ్డారు. బుధవారం సాయంత్రం బడి నుంచి రాగానే నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లారా పిల్లలు. అలా వెళ్లిన వారిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బురదలో చిక్కుకుని అసువులు బాశారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. ఈ విషాద ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.
- చితూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
చిత్తూరు నగరంలోని మంగసముద్రంకు చెందిన మురుగన్ కుమారుడు బాలాజీ(13), ప్రకాష్ కుమారుడు హరి(13) సంతపేట పీఎన్‌సీ మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. వీరితోపాటు కాలనీ పిల్లలంతా కలిసి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం హుండీ చేతపట్టుకుని చందాలు వసూలు చేశారు. ఆ డబ్బుతో చిన్న వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి సోమవారం దొంగలబావి వీధిలో ఏర్పాటు చేశారు. పూజలు చేశారు. బుధవారం మూడో రోజు కావడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకున్నారు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లినా వారి ధ్యాసంతా వినాయకుడి నిమజ్జనంపైనే ఉంది. సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలంతా కలిసి వినాయక మండపానికి చేరుకున్నారు. పూజలు చేశాక సంతపేట బుడమాల చెరువులో నిమజ్జనం చేయడానికి బయలుదేరారు. చెరువు కిలోమీటరుకుపైగా దూరం ఉంది. దీంతో కాలనీలో బయలుదేరిన వారంతా మధ్యలోనే ఆగిపోయారు. చివరకు బాలాజీ, హరితో పాటు మరో స్నేహితుడు మాత్రమే చెరువు వద్దకు చేరుకున్నారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి బాలాజీ, హరి చెరువులోకి దిగారు. నీళ్లు అడుగంటిపోవడంతో.. కొంతవరకు బురదగా ఉంది. విగ్రహం మునగదేమోనని భావించి.. వీరిద్దరూ విగ్రహాన్ని ఎత్తుకుని బురదలో కాస్త ముందుకెళ్లారు. కొంతదూరం వెళ్లాక బురదలో చిక్కుకుని అడుగు వేయలేకపోయారు. బురదలో పడిపోయి మునుగుతూ అరుస్తుండగా.. గట్టుపై ఉన్న స్నేహితుడు పరుగెత్తుకెళ్లి స్థానికులకు చెప్పాడు. వాళ్లు వచ్చి బురదలో దిగి ఇద్దరిని పైకి తీసుకొచ్చారు. అప్పటికే బాలాజీ చనిపోగా.. హరిని వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు.
శోకసంద్రంలో చవటపల్లె, మంగసముద్రం
బాలాజి, హరి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పిల్లలు ఆటలాడుకుని వస్తారనుకుంటే ఇలా బురదనీటిలో మునిగి చనిపోవడంతో చవటపల్లె, మంగసముద్రం కాలనీ వాసులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇద్దరు పిల్లలు చనిపోయారని తెలుసుకుని ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకుని రోదించారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులపై ఆగ్రహం
కాగా, ఇద్దరు విద్యార్థులు బురదనీటిలో మునిగిపోయారని అధికారులకు చెప్పినా సుమారు గంట వరకు అక్కడికి చేరుకోలేదని స్థానికులు అంటున్నారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఒకరైనా బతికేవారన్నారు. ప్రమాద స్థల్నాన వైసీపీ నేతలు విజయానందరెడ్డి, జ్ఞాన జగదీశ్ చేరుకుని అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.