డ్రోన్ ఫైలట్ శిక్షణకు అధికారిక అనుమతులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:22 AM
ఎస్వీయూనివర్సిటీ ప్రాంతంలో డ్రోన్ ఫైలట్ శిక్షణకు అనుమతులు లభించాయి. దీంతో వీసీ నరసింగరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతులతో యూనివర్సిటీ డ్రోన్ స్కిల్ హబ్‌గా రూపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక కోర్సుకు రూపకల్పన
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూనివర్సిటీ ప్రాంతంలో డ్రోన్ ఫైలట్ శిక్షణకు అనుమతులు లభించాయి. దీంతో వీసీ నరసింగరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతులతో యూనివర్సిటీ డ్రోన్ స్కిల్ హబ్‌గా రూపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనుమతులు జారీ చేసిన సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ముఖ్యమైన మైలురాయిని యూనివర్సిటీ సాధించిందన్నారు. వారం కాల పరిమితితో డ్రోన్ ఫైలట్ శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. ఈ శిక్షణకు అవసరమైన సదుపాయాలను వీసీ నరసింగరావు తదితరులు శుక్రవారం పరిశీలించారు. భాగస్వామ్య సంస్థ అయిన ఏరో హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిపుణులు ప్రణవ్‌కుమార్, రితే్‌షకుమార్‌సింగ్ నేతృత్వంలో శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పదేళ్ల కాలం విలువ గల సర్టిఫికెట్ అందిస్తామన్నారు. తద్వారా డ్రోన్ ఆపరేట్ చేయడానికి అనుమతి పొందుతారని తెలిపారు. 10వ తరగతి విద్యార్హత, 18-65 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులన్నారు. త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచీ శిక్షణ అందిస్తామన్నారు.