Share News

ఆఫీసులు సరే....నివాసాలెక్కడ?

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:41 AM

మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా యంత్రాగానికి కావాల్సిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల కేటాయింపు పూర్తయింది

ఆఫీసులు సరే....నివాసాలెక్కడ?
ఎస్పీ కార్యాలయానికి కేటయించిన రేస్‌ బీఈడీ కళాశాల

మదనపల్లె, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా యంత్రాగానికి కావాల్సిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల కేటాయింపు పూర్తయింది. జిల్లా కేంద్రంలో 64శాఖలు పనిచేయాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రం ప్రకటన వెలువడగానే ఇక్కడి అధికారులు ముందస్తుగా బి.టి.కళాశాల, సెరికల్చర్‌ భవనసముదాయం, రేస్‌ బీఈడీ కళాశాల, బి.టి.కళాశాల పీజీ హాస్టల్‌ భవనాలు, రేస్‌ లేడీస్‌ హాస్టల్‌, డివిజనల్‌ అభివృద్ధి అధికారి భవన సముదాయాలను ఎంపిక చేశారు. 34 భవనాల్లో 64శాఖలకు గదులు కేటాయించారు. ఒక్కో శాఖకు గరిష్టంగా ఆరు, కనిష్ఠంగా రెండు గదులు కేటాయించారు. ప్రస్తుత సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టరేట్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)కు కేటాయించారు. ఏడీఎ్‌సలోని డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి అప్పగించారు. రేస్‌ బీఈడీ కళాశాలను ఎస్పీ కార్యాలయానికి కేటాయించారు. మిగిలిన వాటిలో పది నుంచి 14 విభాగాలకు గదులను కేటాయించారు. ఇందులో సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయం నుంచీ అన్నింటినీ తమకు కావాల్సిన రీతిలో మారుస్తున్నారు. ప్రాథమిక వసతులు కల్పిస్తున్నారు. సబ్‌కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా మార్చేందుకు టెండర్‌ పిలవగా, మిగిలిన వాటిని ఎవరికివారే, తమకు అనుకూలంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖర్చుల వివరాలు సమర్పిస్తే, బిల్లులు మంజూరు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ సూచించినట్లు ఆయాశాఖల అధికారులు చెబుతున్నారు.

రాయచోటి నుంచి కార్యాలయాల తరలింపు

పాలనా వ్యవహారాల రికార్డులు, ఇతర సామగ్రిని కొన్ని శాఖలు ఇప్పటికే రాయచోటి నుంచి మదనపల్లెకు తరలించాయి. మరికొన్ని ఆ ప్రక్రియను మొదలు పెట్టాయి. ఈక్రమంలో ఇక్కడ కేటాయించిన భవనాల్లో చిన్నపాటి పనులు, సర్దుబాట్లు చేస్తున్నారు. అధికారికంగా పాలనా మొదలు కాగా, ఇప్పటికే డివిజన్‌ కేంద్రంలో ఉండిన ఆయా శాఖల కార్యాలయాల నుంచి అధికారులు, సిబ్బంది హాజరవుతున్నారు. కొత్తగా తెరవాల్సిన శాఖల కార్యాలయాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

శూన్యం ముగిశాకే నివాసాల్లోకి..

తిరుపతి, పీలేరు, కడప ఏరియాల్లో నివాసం ఉంటున్న వివిధశాఖల హెచ్‌వోడీలు, అధికారులు, సిబ్బంది మదనపల్లెకు మకాం మార్చడానికి మంచిరోజు కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండుగతో ముగిశాక (శూన్యం తర్వాత) నివాసాలను పట్టణానికి మార్చుతామని చెబుతున్నారు. కొందరు నివాస పాంతాల నుంచి విధులకు హాజరవుతుండగా, మరికొందరు తాత్కాలికంగా స్థానికంగా హోటళ్లు, లాడ్జిలో ఉంటున్నారు. ఈక్రమంలో ఇక్కడే ఉంటూ తమకు అనుకూలమైన ఏరియా, తమకు కావాల్సిన బడ్జెట్‌లో భవనం, నివాసం వెతుకుతుండగా, మరికొందరు ఆ ఛాయలకు కూడా వెళ్లడం లేదు.

నివాసాల కోసం అన్వేషణ

జిల్లా కలెక్టర్‌ తర్వాత జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ, ఏఎస్పీ, సబ్‌కలెక్టర్‌, డీఆర్‌వో, సర్వేశాఖ ఏడీ, డివిజన్‌స్థాయి అధికారులు కూడా విశాలమైన నివాసాలకోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఆయాశాఖల కింది స్థాయి అధికారులు ఇళ్లకోసం ఆరా తీస్తున్నారు. పట్టణం ట్రాఫిక్‌, వాతావరణ, శబ ్దకాలుష్యం లేకుండా శివారు ప్రాంతాల్లో ఉండాలని భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్స్‌ కాకుండా వ్యక్తిగత నివాసాలు, చుట్టూ ప్రహరీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎస్పీ, సర్వేశాఖ ఏడీకి సత్సంగ్‌ పౌండేషన్‌ సమీపంలోని శిద్దమ్య లేఅవుట్‌లో నివాసాలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 01:41 AM