Share News

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:50 AM

ఓ వ్యక్తికి తాను పుట్టిన ఊరితోపాటు పనిచేస్తున్న పక్క రాష్ట్రంలోనూ ఓటు హక్కు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా రెండు చోట్లా ఉన్న ఓట్లను పరిశీలించి.. ఒక ఓటును తొలగించడానికి అవసరమైన కసరత్తు మొదలుకానుంది.

ఇక డబుల్‌ ఎంట్రీల వంతు
ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా

పక్క రాష్ట్రాల్లోని ఓటరు జాబితాలపైనా దృష్టి

విధి విధానాలపై కసరత్తు

ఓ వ్యక్తికి తాను పుట్టిన ఊరితోపాటు పనిచేస్తున్న పక్క రాష్ట్రంలోనూ ఓటు హక్కు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా రెండు చోట్లా ఉన్న ఓట్లను పరిశీలించి.. ఒక ఓటును తొలగించడానికి అవసరమైన కసరత్తు మొదలుకానుంది.

- సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి

ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో భాగంగా డబుల్‌ ఎంట్రీల(ఒకే వ్యక్తికి రెండు ఓట్ల)పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) జరిగిన ప్రాంతాల్లో ఆ జిల్లా పరిధిలోనే డబుల్‌ ఎంట్రీలను పరిశీలించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటరు జాబితాలను కూడా జిల్లాలకు కేంద్ర ఎన్నికల సంఘం పంపనుంది. వాటిని మన జిల్లా ఓటరు జాబితాలతో సరిచూసి డబుల్‌ ఎంట్రీలను గుర్తించనున్నారు. ఇందుకోసం నూతన సాంకేతిక విధానాన్ని అనుసరిస్తారు. ఫొటో మ్యాచ్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డబుల్‌ ఎంట్రీలు) ద్వారా ఓట్లను గుర్తించనున్నారు. మనపక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో జిల్లావాసులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. వీరికి రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. మరో నాలుగైదు రోజుల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను అన్ని జిల్లాలకు అందనున్నాయి. రెండుచోట్లా ఓటు ఉంటే ఒక ఓటును తొలగించనున్నారు.

ఒక వ్యక్తికి ఒక ఓటు

దేశవ్యాప్తంగా అక్టోబరు 3వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆలోపు దేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Updated Date - Aug 10 , 2026 | 01:50 AM