Share News

‘పరిషత్‌’ పోరుకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:42 AM

జిల్లాలోని 27 మండలాల్లో పరిషత్‌ పోరుకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువడింది. గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి మొదలైంది. 370 ఎంపీటీసీ, 27 జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

‘పరిషత్‌’ పోరుకు నోటిఫికేషన్‌

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

3న పోలింగ్‌

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 27 మండలాల్లో పరిషత్‌ పోరుకు సోమవారం నోటిఫికేషన్‌ వెలువడింది. గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి మొదలైంది. 370 ఎంపీటీసీ, 27 జడ్పీటీసీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 24న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 27న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. నవంబరు 3న పోలింగ్‌, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఎక్కడ నామినేషన్‌ వేయాలంటే..

ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్లు అందజేయాలి. జడ్పీటీసీ స్థానాలకు మాత్రం చిత్తూరులోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. నామినేషన్‌ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిధిలో రాజకీయ ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు.

ఎన్నికల ఖర్చులకు పరిమితి

ఎంపీటీసీ అభ్యర్థి గరిష్ఠంగా రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఎంపీటీసీ స్థానానికి జనరల్‌ అభ్యర్థులు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1500 డిపాజిట్‌ చెల్లించాలి. జడ్పీటీసీ స్థానానికి జనరల్‌ అభ్యర్థులు రూ.6 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.3 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి.

ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్‌ అమలు పర్యవేక్షణకు ఆయా మండలాల్లో తహసీల్దారును అధికారిగా నియమించినట్లు తెలిపారు. మైకుల ద్వారా ఎన్నికల ప్రచారం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, ఇందుకు పోలీసుల లేదా రిటర్నింగ్‌ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, వాహనాల వినియోగానికి అనుమతి తీసుకోవాలని, కాలినడకన ఇంటింటి ప్రచారానికి అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని ఏర్పాటు చేయరాదని, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వంటి ప్రార్థనాస్థలాల్లో ప్రచారం నిర్వహించరాదని సూచించారు. మతం, కులం ఆధారంగా ఓట్లు కోరడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిరాధార ఆరోపణలు చేయడం నిషేధమన్నారు. వివిధ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 20 , 2026 | 01:42 AM