Share News

ముగ్గురు తహసీల్దార్లకు నోటీసులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 01:49 AM

లేని సర్వే నంబర్లను సృష్టించి, భూములు లేకున్నా వాటకి విస్తీర్ణం జతచేసి ఏకంగా రైతుల పేరుతో అక్రమంగా వెబ్‌ల్యాండ్‌లోకే ఎక్కించేసిన వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. సిద్దమవుతోంది. ఒకే మండలంలో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్ల భాగోతంపై ప్రభుత్వం మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ముగ్గురు తహసీల్దార్లకు నోటీసులు

లేని సర్వే నెంబర్లు సృష్టించిన ఘనాపాటీలు

వాటికి కావలసినంత విస్తీర్ణం జతచేసిన వైనం

అన్ని కలిపి వెబ్‌ల్యాండ్‌లో నమోదు

తహసీల్దార్ల వింత పోకడ

కలికిరి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): లేని సర్వే నంబర్లను సృష్టించి, భూములు లేకున్నా వాటకి విస్తీర్ణం జతచేసి ఏకంగా రైతుల పేరుతో అక్రమంగా వెబ్‌ల్యాండ్‌లోకే ఎక్కించేసిన వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది. సిద్దమవుతోంది. ఒకే మండలంలో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్ల భాగోతంపై ప్రభుత్వం మంగళవారం నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలంలో గతంలో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్ల నిర్వాకాల గురించి తమ సంజాయిషీలను 10 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఈ నోటీసుల్లో ప్రభుత్వం ఆదేశించించి. ఈ మండలంలో గతంలో పనిచేసిన ఆర్‌.వెంకటలక్ష్మమ్మ, వి.శ్రీనివాసులు, ఎన్‌.ఎం.గుర్రప్ప చేసిన అక్రమాలను ప్రభుత్వం కూలంకషంగా వివరించింది. ఎస్‌.ఆర్‌.పురం మండలం వేణుగోపాలపురంలో సర్వే నెంబరు 190/1లో 1.45 ఎకరాలు జి.గోవింద రెడ్డి పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. మరో సర్వే నెంబరు 191లో 3.87 ఎకరాలు బి.ఉమాపతి రెడ్డి పేరుతో ఎక్కించారు. అసలు ఈ గ్రామంలో చివరి సర్వే నంబరు 188. దీంతో పై మూడు సర్వే నంబర్లు బోగ్‌సగా గుర్తించారు. అదే విధంగా తాటిమాకులపల్లెలో 424/1 లో 3.75 ఎకరాలు బి.లత (భర్త రాజారెడ్డి) పేరుతో నమోదు చేశారు. ఈ గ్రామంలో చివరి సర్వే నెంబరు 416. ఆపైన సర్వే నంబర్లు లేవు. అదే గ్రామంలో 429/2ఏలో 1.96 ఎకరాలు బి.రేణుక (భర్త రఘునాథ రెడ్డి) పేరుతోనూ, 447లో 4.89 ఎకరాలు బి.వేణునాయుడు పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇవే గాకుండా వేణుగోపాలపురం గ్రామంలో కోదండ రెడ్డి పేరును సర్వే నంబర్లు లేకుండానే డీకేటీ రిజిస్టరులో నమోదు చేశారు. ఇదే గ్రామంలో 159 నంబరులో 3.41 ఎకరాలకు ఎలాంటి పాత అడంగళ్ల ఆధారాలు లేవు. దీనికి సంబంధించిన భూమి కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడా లేదు. ఇక్కడే పి.చిన్నబీదమ్మ (భర్త రఘునాథ రెడ్డి) పేరుతో 189/1 నంబరులో 4.10 ఎకరాలు వెబ్‌ల్యాండ్‌కు ఎక్కించారు. ఇక్కడ కూడా 188 నంబరుతో సర్వే నంబర్లు ముగుస్తున్నాయి. తాటిమాకులపల్లె గ్రామంలో బి.ఈశ్వరి (భర్త నరసింహా రెడ్డి) పేరుతో 429 స.నెం.లో 3.67 ఎకరాలు అక్రమంగా నమోదు చేశారు. మాంగుంట గ్రామంలో కె.చంద్రకళ (భర్త బాలాజీనాయుడు) పేరుతో స.నెం.190/1లో 2.75 ఎకరాలు, 190/2లో 1.25 ఎకరాలు కూడా అక్రమంగా వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారు. అసలు ఈ గ్రామంలోని చివరి సర్వే నంబరు 176తో ముగుస్తోంది. ఇదే గ్రామంలో కె.ప్రకా్‌షబాబు పేరుతో 199/1లో 3.75 ఎకరాలు, 199/2లో 1.0 ఎకరా, బాలాజీనాయుడు పేరుతో 193/1లో 2.70 ఎకరాలు, 193/2లో 2.0 ఎకరాలు నమోదయ్యాయి. తహసీల్దార్లు ఆర్‌.వెంకటలక్ష్మమ్మ, వి.శ్రీనివాసలు, ఎన్‌.ఎం.గుర్రప్ప ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు విచారణలో తేలడంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ముగ్గురికీ విడివిడిగా సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. అవసరమైన ఆధారాలన్నీ నోటీసులకు జత చేశారు.

Updated Date - Apr 22 , 2026 | 01:49 AM