Share News

1,31,084 మందికి నోటీసులు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:35 AM

జిల్లాలో ఎస్‌ఐఆర్‌(సర్‌) కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. 45 రోజుల పాటు చేపట్టిన సర్వేలో ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైన విషయం తెలిసిందే. 2003 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ కాని వారిని, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్న వారిని అధికారులు గుర్తించారు. వీరికి ఆయా మండలాల ఏఈఆర్‌వోలు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత సమయంలో నేరుగా వచ్చి నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేకున్నా ఆన్‌లైన్‌లో సమాధానం ఇవ్వాలని దాని సారాంశం.

1,31,084 మందికి నోటీసులు
మదనపల్లె మండలంలో ఓటరుకు నోటీసు ఇస్తున్న బీఎల్‌వో

నో మ్యాపింగ్‌లో 35,187

వ్యత్యాసాలు 95,897

తుది దశకు చేరుకున్న సర్‌

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్‌ఐఆర్‌(సర్‌) కార్యక్రమం తుదిదశకు చేరుకుంది. 45 రోజుల పాటు చేపట్టిన సర్వేలో ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైన విషయం తెలిసిందే. 2003 ఓటరు జాబితాతో మ్యాపింగ్‌ కాని వారిని, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్న వారిని అధికారులు గుర్తించారు. వీరికి ఆయా మండలాల ఏఈఆర్‌వోలు నోటీసులు జారీ చేశారు. నిర్దేశిత సమయంలో నేరుగా వచ్చి నోటీసులకు వివరణ ఇవ్వాలని, లేకున్నా ఆన్‌లైన్‌లో సమాధానం ఇవ్వాలని దాని సారాంశం.

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1,424 పోలింగ్‌ స్టేషన్‌లలో కలిపి 11,32,843 ఓటర్లు ఉన్నట్లు తొలిజాబితా నమోదైంది. వీరిలో మ్యాపింగ్‌ కాని వారు, వ్యత్యాసం ఉన్న ఓటర్లుగా 1,31,084 మందిని గుర్తించారు. ఇందులో మ్యాపింగ్‌ కాని వారు 35,187 మంది ఉండగా, మ్యాపింగ్‌లో వ్యత్యాసం ఉన్న వారు 95,897 మందిని అధికారులు గుర్తించారు. వీరందరికి ఆయా మండలాల ఏఈఆర్‌వోల ఆధ్వర్యంలో బీఎల్‌వోల ద్వారా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన ఏడు రోజుల్లో వాటికి వివరణ/సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.

రాయచోటిలో అధికం..పుంగనూరులో అథమం

జిల్లాలో ఎక్కువ ఓటర్లు ఉన్న రాయచోటి నియోజకవర్గంలోనే అధికంగా నోటీసులు జారీ చేశారు. 36,424 మందికి నోటీసులు జారీ చేశారు. తంబళ్లపల్లెలో 26,735, పీలేరులో 25,708, మదనపల్లెలో 21,640, పుంగనూరులో అథమంగా 20,577 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. రాయచోటిలో నో మ్యాపింగ్‌ కింద 12,783 ఓట్లు ఉండగా ఎక్కువగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముంది.

వివరణకు 20రోజుల గడువు

జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల(తహసీల్దార్ల) ద్వారా ఓటర్లకు నోటీసులు పంపారు. ఇప్పటికే సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు ఆయా ఓటర్లకు నోటీసులు అందజేశారు. వీటికి సెప్టెంబరు 10వ తేదీలోపు వివరణ/సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఓటర్లు నేరుగా కాని, ఆన్‌లైన్‌ ద్వారా కాని ఏఈఆర్‌వోలకు వివరణ ఇవ్వాల్సి ఉంది.

నోటీసు వస్తే ఓటు పోతుందనుకోవద్దు

ఓటర్లకు నోటీసులు వస్తూనే ఓటు హక్కు కోల్పోతారనుకోవద్దు. మ్యాపింగ్‌, మ్యాపింగ్‌లో వ్యత్యాసాలను సవరించుకునేందుకు ఇది ఒక అవకాశం. ఓటు మ్యాపింగ్‌లో వ్యత్యాసం ఉంటే సంబంధిత ధ్రువపత్రాలను ఏఈఆర్‌వోలకు చూపించి ఓటు హక్కు పొందవచ్చు.

- నిశాంత్‌కుమార్‌, కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి

Updated Date - Aug 22 , 2026 | 12:35 AM