Share News

42శాతం మంది ఓటర్లకు నోటీసుల పంపిణీ

ABN , Publish Date - Aug 18 , 2026 | 01:43 AM

నెలాఖరులోగా మిగిలిన 60 శాతం పూర్తికి ఆదేశాలు

42శాతం మంది ఓటర్లకు నోటీసుల పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్‌) తొలి అంకంలో భాగంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి రెండు నెలలుగా 12,04,067 మందిని గుర్తించారు. వారి వివరాలను డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. వివిధ కారణాలతో 1,34,312 మంది వివరాలు లేకపోవడంతో వారందరికీ ఈనెల ప్రారంభం నుంచి నోటీసులు జారీ చేస్తున్నారు. వీరిలో అక్షర దోషాలున్న 1,10,431 మందిని గుర్తించగా, మ్యాపింగ్‌ జరగని 23,881 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఇంకా శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఓటుహక్కు ఉన్నవారు, మృతుల పేర్లు కూడా ఉన్నాయి. గత నెల 31వ తేదీ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరిగిన విషయం తెలిసిందే. అతి కీలకమైన అంకం ఈనెల 1 నుంచి ప్రారంభం కాగా 31వ తేదీ వరకు కొనసాగింది. ఇప్పటికే ఓటరు ఇళ్లకు మూడుసార్లు వెళ్లిన బీఎల్వోలు ఇప్పుడు నాలుగోసారి వెళ్లి వివరాలు సక్రమంగా ఇవ్వని 1,34,312 మందికి నోటీసులు ఇచ్చి వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం నాటికి వీరిలో 56,396 (42శాతం) మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. నోటీసు పొందిన వారు తమ ఓటు హక్కు కొనసాగించేందుకు ఆధారాలతో పోలింగ్‌ కేంద్రాలకు 7వ రోజు వెళ్లాలి. అక్కడ తహసీల్దారు, ఎంపీడీవో, బీఎల్వో, సూపర్‌వైజర్లకు 11రకాల ధ్రువపత్రాల్లో ఒకదాన్ని అందించాలి. సక్రమంగా ఉంటే వారి పేరు జాబితాలో చేరుస్తారు. ఈ మేరకు గత 15 రోజుల్లో 2,235 మందిని అర్హులుగా గుర్తించారు.

బీఎల్వో విధులా... వద్దేవద్దు!

ఇదిలావుండగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పెరిగిన పోలింగ్‌ కేంద్రాల సంఖ్య మేర కొత్తగా 197 మందిని బీఎల్వోలుగా సచివాలయ ఉద్యోగులను నియమించారు. వీరితో జిల్లాలో బీఎల్వోల సంఖ్య 1708కి చేరింది. వీరిలో ఎక్కువ మందిని కుప్పం నియోజకవర్గానికి నియమించగా... తమకు అక్కడ బీఎల్వో విధులు వద్దే వద్దంటూ చాలా మంది ఈనెల ప్రారంభంలో చేరలేదు. ఒకటికి రెండుసార్లు తాకీదులిచ్చి విధుల్లో చేరకుంటే సస్పెండ్‌ చేస్తామని ఈఆర్వోలు గట్టిగా చెప్పడంతో బలవంతంగా చేరారు.

వడపోత చేసినా ఇంకా..

ముసాయిదా జాబితాలో ఇంకా అక్కడక్కడ వడపోత పోసిన తర్వాత కూడా అక్షర దోషాలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ఓట్లు వేర్వేరుగా నమోదయ్యాయి. భార్యాభర్తల ఓట్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో లేవు. కొన్నిచోట్ల జెండర్‌ను మార్చేశారు. మహిళా ఓటరును పురుషుడిగా నమోదు చేశారు. ఇటువంటి దోషాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం బీఎల్వోలు వాటిని పునఃపరిశీలన చేసి సర్దుతున్నారు.

వచ్చేవారం ‘సర్‌’ ప్రత్యేకాధికారి రాక

ప్రస్తుతం కొనసాగుతున్న రెండో అంకం సర్‌ ప్రక్రియ ప్రగతి పరిశీలించేందుకు జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం బీసీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి.మల్లికార్జునను నియమించింది. ఆయన వచ్చే వారం చిత్తూరుకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 18 , 2026 | 01:43 AM