Share News

హాసిని కాదు.. హంతకి!

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:40 AM

జిల్లాను ఉలికిపాటుకు గురిచేసిన తమిళనాడు వాసి రమేష్‌ హత్య కేసులో భార్య హాసినియే హంతకిగా తేలింది. గుడుపల్లె మండలంలోని మల్లప్పకొండకు భార్య హాసిని, ఏడాదిన్నర బిడ్డతో కలిసి వెళ్లిన రమేష్‌ ఈనెల 14న హత్యకు గురైన విషయం తెలిసిందే. తర్వాత హాసిని, బిడ్డ అదృశ్యమైన నేపథ్యంలో కుప్పం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించారు.

హాసిని కాదు.. హంతకి!
భార్య హాసినితో హతుడు రమేశ్‌ (ఫైల్‌ ఫోటో)

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే..

ప్రేమికులతో పాటు ఆరుగురి అరెస్టు

డీఎస్పీ పార్థసారథి వివరాలు వెల్లడి

కుప్పం, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లాను ఉలికిపాటుకు గురిచేసిన తమిళనాడు వాసి రమేష్‌ హత్య కేసులో భార్య హాసినియే హంతకిగా తేలింది. గుడుపల్లె మండలంలోని మల్లప్పకొండకు భార్య హాసిని, ఏడాదిన్నర బిడ్డతో కలిసి వెళ్లిన రమేష్‌ ఈనెల 14న హత్యకు గురైన విషయం తెలిసిందే. తర్వాత హాసిని, బిడ్డ అదృశ్యమైన నేపథ్యంలో కుప్పం పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించారు. డీఎస్పీ పార్థసారథి శనివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం శాంతిపురం మండలం బోయనపల్లెకు చెందిన హాసిని, తమిళనాడులోని దేవదాసనపల్లెకు చెందిన రమేశ్‌ (30)లకు 2024లో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసున్న మౌనిక అనే కుమార్తె ఉంది.

వివాహేతర సంబంఽధమే కారణం

హాసినికి, సొంతూరికి చెందిన గంగాధర్‌తో స్కూలు రోజుల నుంచే పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. అయితే తల్లిదండ్రులు చిన్న వయసులోనే రమేష్‌తో పెళ్లి చేశారు. పెళ్లయ్యేనాటికి ఆమె వయసు 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువే. ప్రసవం కోసం వచ్చిన హాసిని ఏడాదిపాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. ఈ సమయంలో గంగాధర్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. ఈక్రమంలో భర్త రమేశ్‌ అడ్డు తొలగించుకోవడానికి ప్రియునితో కలిసి ప్లాన్‌ వేసింది. ఇందుకోసం గంగాధర్‌ తన స్నేహితుల సహకారం కూడా తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా భర్త రమేష్‌ను వెంట తీసుకుని బిడ్డతో సహా ఈనెల 13న పుట్టినూరు బోయనపల్లెకు వచ్చింది. 14న మొక్కు ఉందని నమ్మించి భర్త,బిడ్డతతో ద్విచక్ర వాహనంపై మల్లప్పకొండకు బయలుదేరింది. మూడో ఘాట్‌ వద్ద వాహనాన్ని ఆపించింది. అంతకుముందే మొబైల్‌ ద్వారా ప్రేమికుడు గంగాధర్‌కు లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేసింది. అప్పటికే మాటువేసివున్న నిందితులు, రమేష్‌ను అడవిలోకి లాక్కునివెళ్లి, తాడుతో కాళ్లూచేతులూ కట్టేసి కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. భర్త హత్యకు ప్రియుడు గంగాధర్‌తో కలిసి హాసిని పకడ్బందీగా ప్లాన్‌ వేసినా, చివరకు నిందితులు సీసీటీవీ ఫుటేజీవల్ల దొరికిపోయారు. ఈ కేసులో ఏ-1 గా ఆర్‌.గంగాధర్‌, ఏ-2 గా సీఎస్‌.హాసిని, ఏ-3 గా పవన్‌, ఏ-6 గా వై.శేఖర్‌, ఏ-7 గా సంతోష్‌, ఏ-8 గా సురేంద్రలను గుర్తించారు. వీరిని శాంతిపురం మండలం వివరామపురం సమీపంలోని పాలారు బ్రిడ్జివద్ద అటవీ ప్రాంతంలో అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు శ్యాంసన్‌, శివలు పరారీలో ఉన్నారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గుట్టు విప్పిన సీసీటీవీ ఫుటేజీ

పోలీసులకు లభించిన సీసీటీవీ ఫుటేజీ హత్య వెనుక గల గుట్టు విప్పింది. బిడ్డను చేతపట్టుకుని ఓ మహిళ ఇద్దరు పురుషులతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ కనిపించిన దృశ్యాన్ని పోలీసులు గుర్తించారు. అంతకుముందు అదే ద్విచక్ర వాహనంపై ఆమె అదే మార్గంలో బిడ్డతో కలిసి భర్త రమేష్‌తో ప్రయాణిస్తున్న ఫుటేజీ కూడా లభించింది. ఈక్రమంలోనే పోలీసులు అనుమానించారు. వివాహేతర సంబంధమనే కోణంలో దర్యాప్తు తీవ్రతరం చేశారు. కేసును పోలీసులు ఛేదించగలిగారు. విలేకరుల సమావేశంలో కుప్పం రూరల్‌ సీఐ జె.మల్లేశ్‌ యాదవ్‌, రాళ్లబూదుగూరు, గుడుపల్లె, రామకుప్పం ఎస్‌ఐలు ఐ.నరేష్‌, పి.శ్రీకాంత్‌, పి.వెంకటమోహన్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 01:40 AM