Share News

ప్రతీకారం కాదు.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:50 AM

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరును చిత్తూరు జిల్లా ప్రజలు ఇప్పటికీ మరచిపోలేకున్నారు. బెదిరింపులు, అక్రమ కేసులు, ఫోర్జరీ సంతకాలు, కిడ్నాపులు.. ఇలా అనేక రకాల ప్రయత్నాలతో అక్రమ ఏకగ్రీవాలు చేసుకున్నారు.

  ప్రతీకారం కాదు.. ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు
చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద వంద మీటర్ల దూరంలోనే అడ్డుకుంటున్న పోలీసులు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల తీరిది

నేడు

జిల్లాలో వార్డులు 168. నామినేషన్లు వేసింది టీడీపీ తరపున 607.. వైసీపీ నుంచి 468.

ఒక మేయర్‌, మూడు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలకు టీడీపీ తరపున 18.. వైసీపీ నుంచి 24 నామినేషన్లు దాఖలయ్యాయి.

గత మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల ఘట్టం ఎంత ప్రశాంతంగా.. ప్రజాస్వామ్యబద్దంగా జరిగిందో ఈ గణాంకాలే చెబుతాయి.

నాడు

జిల్లాలో ఐదేళ్ల కిందట.. వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థలకు.. ఇప్పుడు జరుగుతున్న తీరుకు మధ్య ఎంతో తేడా ఉంది. ఎక్కడా ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అధికార పార్టీ వారు అడ్డుకోలేదు. దీంతో అన్ని స్థానాలకూ వైసీపీ తరపున నామినేషన్లు దాఖలయ్యాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరును చిత్తూరు జిల్లా ప్రజలు ఇప్పటికీ మరచిపోలేకున్నారు. బెదిరింపులు, అక్రమ కేసులు, ఫోర్జరీ సంతకాలు, కిడ్నాపులు.. ఇలా అనేక రకాల ప్రయత్నాలతో అక్రమ ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇలా అప్పట్లో ప్రజాస్వామ్యం అపహాస్యమవ్వగా, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌ సహా కుప్పం, పలమనేరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ప్రతీకారం వైపు కాకుండా, ప్రశాంతత వైపు ప్రయాణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నాడు తుంగలో తొక్కిన నిబంధనావళిని నేడు అధికారులు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సహా అధికారులంతా నిబంధనల మేరకు నడుచుకుంటున్నారు.

చిత్తూరులో కిడ్నాపులు, బెదిరింపులు

చిత్తూరు కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థుల్ని ఏకంగా కిడ్నాప్‌ చేసి మరీ విత్‌డ్రా చేయించారు. లొంగనివారిపై అక్రమ కేసులు పెట్టించారు. కొందరు పోలీసు అధికారులు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లను విత్‌డ్రా చేయించారు. పోలీసుల కేసులకు భయపడి అప్పట్లో ప్రస్తుత మేయర్‌ అభ్యర్థి కఠారి హేమలత భర్త ప్రవీణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో పూర్తిగా లొంగిపోయారు. ఇక్కడ 50 డివిజన్లుంటే ఏకంగా 37 చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. చిత్తూరులో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చిత్తూరుకు బయల్దేరగా, అయన్ను రేణిగుంట ఎయిర్‌పోర్టులో రోజంతా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం మళ్లీ వెనక్కి పంపేశారు.

కుప్పంలో దొంగ ఓటర్ల దిగుమతి

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో కూడా అక్రమ ఏకగ్రీవాలకు ప్రయత్నించారు. అక్కడ జిల్లా మొత్తం టీడీపీ నాయకులు గట్టిగా పోరాడారు. అయినా ఓ చోట ఏకగ్రీవం చేసుకున్నారు. పోలింగ్‌ రోజు తమిళనాడు నుంచి పెద్దఎత్తున దొంగ ఓటర్లను బస్సుల్లో తరలించారు. 24 వార్డుల్లోనూ దొంగ ఓటర్లు పెద్దఎత్తున పాల్గొని ఓట్లేశారు. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ తమిళనాడు ఓటర్లున్న బస్సుల్ని నిలువరించారు.

అప్పట్లో పెద్దఎత్తున ఏకగ్రీవాలు

అప్పట్లో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో మొత్తం 248 వార్డులకుగానూ 131 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 116 వార్డులకు మాత్రమే పోలింగ్‌ జరిగింది. రెండో విడతలో కాస్త ఆలస్యంగా కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు జరగ్గా.. 25 వార్డుల్లో ఓదాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక, చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు 37.. పలమనేరులో 26 వార్డులకు 18.. నగరిలో 29 వార్డులకు 7, పుత్తూరులో 27 వార్డులకు ఒకటి చొప్పున ఏకగ్రీవాలను చేసుకున్నారు.

ప్రస్తుతం ఒక్క ఏకగ్రీవమూ కాదు..

చిత్తూరు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వైసీపీ అభ్యర్థులు ప్రశాంతంగా నామినేషన్లు వేశారు. ప్రస్తుతం 168 వార్డులుండగా.. ఒక్కటంటే ఒక్కటీ టీడీపీకి ఏకగ్రీవం కాలేదు. ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులు ప్రశాంత ఎన్నికల్ని కోరుకోవడంతో ఎక్కడా అక్రమాలకు, దాడులకు పాల్పడలేదు. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలే ఓట్లేస్తారని నమ్ముతున్నారు.

Updated Date - Oct 19 , 2026 | 01:50 AM