ఒక్క క్షతగాత్రుడి ప్రాణమూ పోకూడదు
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:55 AM
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణం కాపాడాలంటే ‘తొలి గంట’లో అందే వైద్యమే కీలకం. ఈ గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్’ (ప్రైమ్ మినిస్టర్- రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్) పథకాన్ని తీసుకొచ్చింది.
గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్సే ‘పీఎం- రాహత్’ ఉద్దేశం
బాధితుడికి రూ.రూ.1.50 లక్షల నగదురహిత వైద్యం
ఆస్పత్రిలో చేర్పించిన వారికి రూ.25వేల ప్రోత్సాహం
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణం కాపాడాలంటే ‘తొలి గంట’లో అందే వైద్యమే కీలకం. ఈ గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్’ (ప్రైమ్ మినిస్టర్- రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్‌మెంట్) పథకాన్ని తీసుకొచ్చింది. గుర్తింపు పొందిన ఆస్పత్రిలో క్షతగాత్రుడికి రూ.1.5 లక్షల నగదురహిత వైద్యం.. వెంటనే ఆస్పత్రికి చేర్చిన వారికి ప్రోత్సాహంగా రూ.25 వేల పురస్కారం అందిస్తారు.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఘటన జరిగిన వెంటనే చికిత్స అందించాలంటే తక్షణం డబ్బులు ఉండాలి. అవి లేకపోవడం, ప్రమాద స్థలం నుంచి సకాలంలో ఆస్పత్రికి చేర్చేందుకు ఎవరూ చొరవ చూపక పోవడం వంటి ఘటనలతో సరైన వైద్యం అందక ఇంకొందరు వికలాంగులుగా మారుతున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకం ఎంతో ఉపయోగ పడుతుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని.. వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్పించాలి. అలాచేస్తే 90 శాతం వరకు క్షతగాత్రులు బతికే అవకాశం ఉంది. ఇందుకోసం బాధితుల వద్ద డబ్బులు ఉండదనే కారణాన్ని డాక్టర్లు చూపకుండా చికిత్స అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఇలా గుర్తింపు పొందిన ఆస్పత్రిలో చేరే క్షతగాత్రుడికి రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందిస్తారు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ అమలయ్యే ఆస్పత్రుల్లో ఈ సదుపాయం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన రోజు నుంచి మొదటి 7 రోజుల వరకు వైద్య ఖర్చులను ఈ పథకం భరిస్తుంది. జాతీయ రహదారులే కాకుండా రాష్ట్ర రహదారులు, స్థానిక రోడ్లపై జరిగే ప్రమాదాలకూ ఈ పథకం వర్తిస్తుంది. ప్రమాదానికి గురైన వారిని 24 గంటలలోపు(సాధారణ గాయాలు) లేదా 48 గంటలలోపు(తీవ్ర గాయాలు) సమీపంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించవచ్చు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రోడ్డు ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అమలు ఇలా..
ఫ ఈ పథకం కోసం పోలీసుల ‘ఈ-డార్(ఎలకా్ట్రనిక్ డీటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్), నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఆస్పత్రులకు నేరుగా క్లెయిమ్ చెల్లిస్తారు.
ఫ బాధితులు బీమా కలిగి ఉన్నారా లేదా అనే అంశంతో సంబంధం లేదు.
ఫ ‘హిట్ అండ్ రన్’ కేసుల్లోనూ ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుంది.
ఫ ప్రమాదం జరిగిన వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా అంబులెన్సు సదుపాయం, సమీపంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రి వివరాలు పొందవచ్చు.
‘రాహ్ వీర్’లకు ప్రోత్సాహం
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది తమకెందుకులే అని చూసీచూడనట్లు వెళ్లిపోతుంటారు. సామాజిక స్పృహ, న్యాయ అంశాలపై అవగాహన ఉన్న వారే క్షతగాత్రులకు సాయం చేసేందుకు ముందుకు వస్తుంటారు. అలా ముందుకు వచ్చిన వారిని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ‘రాహ్ వీర్’లుగా గుర్తిస్తుంది. వీరికి రూ.5 వేల నుంచి రూ.25 వేల దాకా నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందజేస్తుంది.
తొలి లబ్ధిదారు నిండ్ర వ్యక్తి
ఈ పథకం కింద నిండ్రకు చెందిన వ్యక్తి తొలి లబ్ధిదారు అయ్యారు. నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈయన్ను స్థానికులు తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడికి పీఎం-రాహత్ స్కీమ్ కింద రూ.1.50 లక్షల వరకు నగదురహిత వైద్య సేవలందేలా పోలీసులు చర్యలు చేపట్టారు.
ప్రాణాలను కాపాడటం మనందరి బాధ్యత
ప్రజల ప్రాణాలను కాపాడటం మనందరి బాధ్యత. ప్రమాదవశాత్తు ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికంగా ఉన్న వారు ముందుకొచ్చి సమీప ఆస్పత్రికి చేర్చాలి. సకాలంలో వైద్యం అందితే ప్రాణాలను కాపాడిన వారవుతాం. మానవతా దృక్పథంతో అందరూ ఈ దిశగా క్షతగాత్రులను ఆదుకోవాలి.
- తుషార్ డూడీ, ఎస్పీ