ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒక్కటీ ఆగడం లేదు
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:04 AM
రోజూ చిత్తూరు నుంచి సరిహద్దు రాష్ట్రాలకు ఉద్యోగ, వ్యాపారరీత్యా ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.
చిత్తూరు రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు... అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. ఉద్యోగ, వాణిజ్యానికి అనువైన ప్రాంతం. రోజూ చిత్తూరు నుంచి సరిహద్దు రాష్ట్రాలకు ఉద్యోగ, వ్యాపారరీత్యా ప్రయాణించే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. కానీ, చిత్తూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మాత్రం రైళ్ల సౌకర్యం కరువైంది. దీంతో చేసేది లేక ఆర్థిక భారమైనప్పటికి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. చిత్తూరు.. జిల్లా కేంద్రమైనా, ఇక్కడి రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే ఏ ఒక ఎక్స్‌ప్రెస్ రైలూ ఇక్కడ ఆగదు. ఇక్కడ వింతేమిటంటే తిరుపతి జిల్లాలోని పాకాల రైల్వేస్టేషన్‌లో ఆగే రైళ్లు కూడా చిత్తూరులో ఆగకపోవడం గమనార్హం. రోజూ పదుల సంఖ్యలో రైళ్లు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగానే ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నా ఇక్కడ ఆగవు. కనీసం మన పక్కనే ఉన్న చెన్నైకి వెళ్లడానికి కూడా రైలు సౌకర్యం లేక కాట్పాడ వెళ్లాల్సి వస్తోంది. ఏన్నో ఏళ్లుగా చిత్తూరువాసులు రైల్వే అధికారులను, ప్రజాప్రతినిధులు అభ్యర్థిస్తున్నప్పటికి ఫలితం మాత్రం కనిపించడం లేదు. తమిళనాడులోని కాట్పాడి జంక్షన్ నుంచి చెన్నైకి డైరెక్టు రైలు ఉంది. దీనిని చిత్తూరు వరకు పొడిగిస్తే నిత్యం వ్యాపారం, ఉద్యోగం కోసం చెన్నైకి వెళ్లే వందలాది మందికి సౌకర్యం ఏర్పడుతుంది. ఇక, చిత్తూరు మీదుగా వెళ్లే ఈ రైళ్లను ఎక్కాలంటే తిరుపతి లేదా కాట్పాడికి వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయం, డబ్బులు వృథా అవుతున్నాయి.
చిత్తూరులో ఆగని రైళ్లు ఇవే..
చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి నిత్యం హౌరా- యశ్వంత్‌పుర్, కన్నియకుమారి- పూణే, తిరుపతి- రామేశ్వరం, ఓకా - రామేశ్వరం, హటియా- యశ్వంత్‌పుర్, హౌరా- పాండిచ్చేరి. ఇలా అనేక రాష్ట్రాలకు ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు చిత్తూరులో ఆగడం లేదు.
నేతలు చొరవ చూపితేనే..
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు సౌకర్యం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో ఇప్పుడు మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతున్నాయక్కడ. అదేవిధంగా ఇక్కడి ప్రజాప్రతినిధులూ చొరవ చూపి.. సీఎం చంద్రబాబు ద్వారా రైల్వేశాఖ దృష్టికి సమస్యను తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని స్థానికులు అంటున్నారు.
తమిళనాడులో ఏం జరిగిందంటే?
తిరుపతి-మన్నారుగుడి ఎక్స్‌పెస్ రైలు పన్రొట్టి స్టేషన్‌లో ఆగడం లేదని అక్కడి ప్రజలు తమిళనాడు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఆశ్వత్థామన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే రైల్వే శాఖా మంత్రి ఆశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ రైలును పన్రోట్టి స్టేషన్‌లో ఆగేలా ఆర్డర్స్ పాస్ చేయించారు.