తొలిరోజు మందకొడిగా నామినేషన్లు
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:20 AM
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. తొలిరోజైన ఆదివారం తిథి షష్టి ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది.
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. తొలిరోజైన ఆదివారం తిథి షష్టి ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది. ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని 16 మండలాల్లో 404 సర్పంచ్ స్థానాలకు 269 మంది, 3,684 వార్డు స్థానాలకు 319 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మున్సిపల్, ‘పరిషత్’ పోరులో జరిగిన సంఘటనల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలతో పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దాంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సోమవారం సప్తమి కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.
రెండో విడతకు నేడు నోటిఫికేషన్
జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. చంద్రగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు నగరి నుంచి వచ్చిన వడమాలపేట, పుత్తూరు మండలాలతోపాటు గూడూరు నియోకవర్గంలోని వాకాడు, చిట్టమూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొత్తం 19 మండలాల్లో 373 సర్పంచ్, 3,526 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి 106 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. 18న రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ ఇచ్చాక నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 20తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 21న అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, 22న తిరస్కరణకు గురైన నామినేషన్ల అప్పీళ్లు, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న ఉపసంహరణకు గడువు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, గుర్తుల కేటాయింపు, 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల ప్రకటన ఉంటుంది. అవసరమైన చోట్ల 30న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో జరిగే ఎన్నికల్లో 6,41,533మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.