పరిషత్ ఎన్నికలకు రేపట్నుంచి నామినేషన్లు
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:58 AM
జిల్లా,మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. దీంతో జిల్లాలో 35 జడ్పీటీసీలు, 444 ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా,మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. దీంతో జిల్లాలో 35 జడ్పీటీసీలు, 444 ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.జిల్లాలో 15,58,150మంది జనాభా ఉండగా 12,54,371 మంది ఓటర్లున్నారు. పురుషులు 6,10,515, మహిళా ఓటర్లు 6,43,752, ఇతరులు 104మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ పర్వానికి ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో దీటైన అభ్యర్థులను ఎంపికచేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుంది. నవంబరు 3న పోలింగ్ నిర్వహించి 5న ఫలితాలు వెల్లడిస్తారు. జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తిరుపతి నగరంలోని డీఆర్‌డీఏ కార్యాలయం(తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపు)లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా మండలాల్లోని ఎండీపీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అఽధికారిగా జడ్పీ సీఈవో శోభన్‌బాబు వ్యవహరిస్తారు. జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీ ఎన్నికను పరోక్షంగా ఎన్నుకోనున్నారు.
పక్కాగా నిబంధనలు అమలు చేయాలి
-ఎన్నికల అధికారి వెంకటేశ్వర్
పరిషత్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి విధులను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై జేసీ గోవిందరావు, జడ్పీ సీఈవో శోభన్‌బాబుతో కలిసి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సందేహాలు తలెత్తినా ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.జేసీ గోవిందరావు మాట్లాడుతూ అభ్యర్థులందరికి సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణ వరకు పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.