Share News

చిత్తూరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:47 AM

చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. అక్టోబరు 16 నుంచి మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.

చిత్తూరులో ముగిసిన నామినేషన్ల ఘట్టం
చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి ఆదివారం టీడీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి వస్తున్న కఠారి హేమలత

చివరి రోజే అత్యధికం

చిత్తూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. అక్టోబరు 16 నుంచి మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు కార్పొరేషన్‌, కుప్పం, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లోని వార్డు స్థానాలకు 1321.. మేయర్‌/ చైర్మన్‌ స్థానాలకు 53 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది.

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకుగానూ మూడు రోజుల్లో 606 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. వీటిలో టీడీపీ నుంచి 271, జనసేన నుంచి 37, బీజేపీ నుంచి 19, వైసీపీ నుంచి 177, సీపీఐ 1, కాంగ్రెస్‌ 1, యువజనతాదళ్‌ 2, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా 4, స్వతంత్రులు 94 నామినేషన్లు అందజేశారు.

కుప్పం మున్సిపాలిటీలో 32 వార్డులకు 282 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో చివరి రోజే 148 నామినేషన్లు రావడం విశేషం. టీడీపీ నుంచి 146, వైసీపీ నుంచి 99, జనసేన నుంచి 13, బీజేపీ నుంచి 2, స్వతంత్రుల నుంచి 22 నామినేషన్లు నమోదయ్యాయి.

నగరి మున్సిపాలిటీలోని 40 వార్డులకు 283 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన ఆదివారం 171 దాఖలయ్యాయి. వైసీపీ నుంచి అధికంగా 130, టీడీపీ నుంచి 121 నామినేషన్లు నమోదయ్యాయి. బీజేపీ, జనసేన, సీపీఐ, కాంగ్రెస్‌, బీఎస్పీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ నామినేషన్లు వేశారు.

పలమనేరు మున్సిపాలిటీలో 36 వార్డులకు మొత్తం 150 నామినేషన్లు నమోదయ్యాయి. చివరి రోజైన ఆదివారం 85 దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 69, వైసీపీ నుంచి 62, జనసేన నుంచి 6, బీజేపీ నుంచి 3, ఇతర పార్టీల నుంచి 4, స్వతంత్రులుగా 6 నామినేషన్లు వచ్చాయి.

వార్డుల్లో టీడీపీ 607, వైసీపీ 468 నామినేషన్లు..

జిల్లాలో మొత్తం 168 వార్డులుండగా.. మూడు రోజుల్లో 1321 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో చూసుకుంటే టీడీపీ నుంచి 607, వైసీపీ నుంచి 468, జనసేన 59, స్వతంత్ర అభ్యర్థులు 169 మంది.. మిగిలిన వారు చిన్న పార్టీల తరఫున నామినేషన్లు వేశారు.

చైర్మన్‌కు టీడీపీ 18.. వైసీపీ 24 నామినేషన్లు..

చిత్తూరు మేయర్‌తో పాటు మిగిలిన మూడు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలకు 53 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 29 వచ్చాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో 14, కుప్పం మున్సిపాలిటీలో 18, నగరిలో 15, పలమనేరులో 7 చొప్పున నమోదయ్యాయి. పార్టీల వారీగా చూస్తే వైసీపీ నుంచి 24, టీడీపీ నుంచి 18, కాంగ్రెస్‌ నుంచి 3, బీఎస్పీ నుంచి 1, స్వతంత్రులుగా 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు.

నేడు నామినేషన్ల పరిశీలన

చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్లను సోమవారం ఉదయం 11 గంటల నుంచి పరిశీలించనున్నారు. ఆర్వో ఆధ్వర్యంలో జరిగే ఈ పరిశీలన కార్యక్రమంలో అభ్యర్థులు లేదా వారి తరపున ఏజెంట్లు పాల్గొంటారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత పోటీల్లో ఉన్న అభ్యర్థుల పేర్లను, ప్రకటిస్తారు.

Updated Date - Oct 19 , 2026 | 01:47 AM