Share News

కరువు ఛాయలు కనిపించకూడదు!

ABN , Publish Date - Jan 15 , 2026 | 01:56 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ కరువుకాటకాలు సంభవించేవని, ఆ ఛాయలు తిరుపతి జిల్లాలో కనిపించడానికి వీల్లేదని జిల్లా యంత్రాంగాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

కరువు ఛాయలు కనిపించకూడదు!

ప్రతి 30 కుటుంబాలకు వంద పశువులతో ఉపాధి

రైల్వే కోడూరు పంటల్ని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి

కళ్యాణి డ్యామ్‌ నుంచి ఇరువైపులా పచ్చదనం పెంచాలి

జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

తిరుపతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ కరువుకాటకాలు సంభవించేవని, ఆ ఛాయలు తిరుపతి జిల్లాలో కనిపించడానికి వీల్లేదని జిల్లా యంత్రాంగాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో బుధవారం ఆయన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తో పాటు ముఖ్యమైన శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆ దిశగా డీఆర్‌డీఏ, డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఇరిగేషన్‌ శాఖలు కీలకంగా పనిచేయాలని సూచించారు. ‘వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ పథకంలో యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 30 కుటుంబాలకు వంద పశువులను కేటాయించి, వాటికోసం షెల్టర్‌ ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖను ఆదేశించారు. ఆ పశువుల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు ఉండేలా చూడాలన్నారు. తద్వారా ప్రతి కుటుంబానికీ నెలకు రూ.35 వేలకు తగ్గకుండా ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. జిల్లాలోని పడమటి మండలాల్లో కరువును ఎదుర్కొనేందుకు పాడి పశువుల పెంపకాన్ని చేపట్టడం కీలకమన్నారు. ప్రకృతి సేద్య పద్ధతులను ఉద్యాన పంటలకే కాదు.. వ్యవసాయ పంటలకూ పాటించాలన్నారు. జిల్లాలో కొత్తగా చేరిన రైల్వే కోడూరు నియోజకవర్గంలో అధికంగా సాగయ్యే మామిడి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలను ఇతర ప్రాంతాలకూ విస్తరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుపతి రూరల్‌కు కృష్ణా జలాలు

నారావారిపల్లి సమీపంలోని మూలపల్లి చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలను తిరుపతి రూరల్‌ మండలానికి కూడా చేర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. సప్లై ఛానెళ్ల ద్వారా ఆ నీటిని చెరువులన్నింటినీ నింపేందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలన్నారు. తర్వాత సమావేశానికి అధ్యయనం పూర్తి చేసి డిజైన్లు చూపాలన్నారు. చిత్తూరు నగర తాగునీటి కోసం పదిపుట్లబైలు వద్ద ఏర్పాటు చేసిన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి నీళ్లు వృథా కాకుండా పాకాల మండలంలోని చెరువులకు మళ్లించడం వీలవుతుందా అని ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నించారు. ఈ చెరువులు ఎత్తులో ఉన్నందున సాధ్యంకాదని అధికారులు చెప్పడంతో దామలచెరువుకు మళ్ళించాలని సీఎం సూచించారు. ‘సాధ్యమైనంతవరకూ వాగుల ద్వారానే నీటిని పంపాలి. నీరు వృథా అవుతుందని భావిస్తే కాలువలు నిర్మించాలి. నిధుల కోసం చూడొద్దు. తక్కువ వ్యయం అయ్యేలా ప్రణాళిక రూపొందించాలి. చంద్రగిరి ప్రాంతంలో భూగర్బ జలాలు 8 అడుగుల కంటే కిందకు పోకుండా కాపాడుకోవాలి’ అని సూచించారు.

తిరుపతిలో 20 చెరువులను పునరుద్ధరించండి

‘తిరుపతి నగరం, చుట్టుపక్కల చెరువులన్నీ మంచి వనాలుగా మారాలి. మియావాకీ చెట్లు పెంచాలి. తిరుపతిలో 20 చెరువులను పునరుద్ధరించి చూపండి. ఆ చెరువులకు నీటిని ఎలా తెస్తారు’ అని చంద్రబాబు అడిగారు. ‘కపిలతీర్థం సమీపం డీఎ్‌ఫవో కార్యాలయం వద్ద ఒక చెరువు నిర్వీర్యమైపోయింది. దాన్ని పునరుద్ధరించాలి. కపిలతీర్థం, మాల్వాడి గుండాల నుంచి నీటిని ఆ చెరువుకు మళ్లించి.. అక్కడ్నుంచి వినాయకసాగర్‌కు, కరకంబాడి దాకా మొత్తం ఆరు చెరువులను నీటితో నింపడానికి వీలవుతుంది’ అని ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాధాకృష్ణ సూచించారు. హైదరాబాదులో ట్యాంక్‌బండ్‌ తరహాలో అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. పేరూరు చెరువులో పూడిక తొలగించాలని, ఆ నీటిని అవిలాల చెరువుకు మళ్లించి, ఆ రెండింటికీ సుందరీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు.

ప్రపంచంలోని వృక్ష జాతులన్నీ కనిపించాలి

ప్రపంచంలోని వృక్ష జాతులన్నింటినీ తెప్పించి కళ్యాణి డ్యామ్‌ ప్రాంతం నుంచీ నారావారిపల్లి మీదుగా పులిచెర్ల వరకూ, అలాగే శేషాచలం వెంబడి రైల్వే కోడూరు దాకా పెంచాలని సీఎం సూచించారు. జనావాసాలపైన, పంట పొలాలపైన ఏనుగులు దాడి చేయకుండా అటవీ సరిహద్దుల్లో కందకాలు తవ్వించాలన్నారు. అదే సమయంలో ఏనుగుల దాహార్తి తీర్చేందుకు అటవీ ప్రాంతంలో ఊట చెరువులను, కుంటలను తవ్వించాలన్నారు.

‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టు మండలానికి వర్తింపు

‘స్వర్ణ నారావారిపల్లె’ ప్రాజెక్టు విజయవంతమైన నేపధ్యంలో దాన్ని చంద్రగిరి మండలమంతా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. మండలస్థాయిలో విజయవంతమైతే దానిని నియోజకవర్గవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ‘స్వర్ణ నారావారిపలె’్ల ప్రాజెక్టును విజయవంతం చేసినందుకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. చాలా బాగా చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, డీపీవో సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, డ్వామా పీడీ శ్రీనివాస్‌, ఉద్యాన శాఖ అధికారి దశరధరామిరెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాధాకృష్ణ, పశు సంవర్ధక శాఖ అధికారి రవికుమార్‌ తదితరులను అభినందించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ గోవిందరావు, ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌ రఘువంశ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 01:56 AM