Share News

మల్లయ్యకొండలో మైనింగ్‌ వద్దు

ABN , Publish Date - May 28 , 2026 | 01:34 AM

అధికారులను అడ్డుకున్న స్థానికులు వాహనాలను ఆపి రోడ్డుపై ధర్నా

మల్లయ్యకొండలో మైనింగ్‌ వద్దు
మైనింగ్‌ అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న స్థానికులు

తంబళ్లపల్లె, మే 27(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె సాధు, ఇనుము, మల్లయ్యకొండల్లో మైనింగ్‌ చేపట్టవద్దని తంబళ్లపల్లె ప్రజలు ఆందోళన చేపట్టారు. బుధవారం సాధు కొండలో సర్వే చేయడానికి మైనింగ్‌ అధికారులు సత్యనారాయణ, మాధవీలత, అటవీ శాఖ బీవోలు మోహన్‌రెడ్డి, రాజారెడ్డి తంబళ్లపల్లెకు వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు, భక్తులు వందలాదిగా తరలివచ్చి సాధుకొండ ప్రవేశ మార్గంలో ఉన్న బోయపల్లెలో అధికారులను అడ్డుకున్నారు. ఎంతో మహిమ గల సాధు, మల్లయ్యకొండను మైనింగ్‌ పేరుతో ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సర్వే కోసం అడవిలోకి పంపించేది లేదని అధికారులపై తిరగబడ్డారు. మైనింగ్‌ చేపట్టవద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పల్లెలో ర్యాలీ చేశారు. దీంతో మైనింగ్‌, అటవీ శాఖ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మల్లయ్యకొండకు మైనింగ్‌ అధికారులు వచ్చారన్న విషయం తెలియడంతో తంబళ్లపల్లె మూడు రోడ్ల కూడలిలో స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున గుమిగూడి మైనింగ్‌ అధికారుల వాహనాలను మరోమారు అడ్డుకున్నారు. రోడ్డుపై గంట సేపు బైఠాయించి ధర్నా చేశారు. మైనింగ్‌ ప్రక్రియ ఇంతటితో ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దమండ్యం రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది. సాధు, మల్లయ్యకొండ చుట్టూ సుమారు 300కు పైగా గ్రామాలున్నాయని, అందరూ వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామన్నారు. ఇక్కడ మైనింగ్‌ చేపడితే భక్తుల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా రైతులు తీవ్రంగా నష్టపోతామన్నారు. మైనింగ్‌ ప్రక్రియ ఆపకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని, ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మైనింగ్‌ అధికారులు చెప్పడంతో ప్రజలు శాంతించి ధర్నా విరమించారు. అనంతరం స్థానికులు తహసీల్దారు శ్రీనివాసులుకు వినతిపత్రం అందచేశారు.

Updated Date - May 28 , 2026 | 01:34 AM