గృహ వినియోగ సిలిండర్లకు ఢోకాలేదు
ABN , Publish Date - Mar 15 , 2026 | 01:51 AM
గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. ఈ సిలిండర్ల సరఫరా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు.
జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. ఈ సిలిండర్ల సరఫరా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఇందుకోసం కంట్రోల్ రూమ్(08572-242734) ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పనివేళల్లో సందేహాలు, ఫిర్యాదులుంటే ఈ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుల అవసరాల మేర గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఏజెన్సీ వద్ద పర్యవేక్షణకు తహసీల్దార్లను నియమించామన్నారు. వదంతులు నమ్మి గ్యాస్ రీఫిల్లింగ్ కోసం పరుగులు తీయవద్దని హితవు పలికారు. బిల్లులో ఉన్న ధర మాత్రమే డెలివరీ బాయ్‌కు చెల్లించాలన్నారు. అదనపు రుసుం చెల్లించవద్దన్నారు. ఎవరైనా ఎక్కువ డిమాండ్ చేస్తే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించే ఏజెన్సీలపై, డొమెస్టిక్ సిలిండర్లనవాణిజ్య అవసరాలకు వినియోగించినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిండు సిలిండర్లను మాత్రమే సరఫరా చేయాలని ఏజెన్సీ యాజమాన్యాలకు జేసీ సూచించారు.