రెండో రోజూ మారని తీరు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:24 AM
జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసే క్రమంలో రెండో రోజైన గురువారం కూడా దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు లాక్కోవడాలూ వంటి ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి.
తిరుపతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసే క్రమంలో రెండో రోజైన గురువారం కూడా దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ పత్రాలు లాక్కోవడాలూ వంటి ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. చంద్రగిరి, శ్రీకాళహస్తి, రైల్వే కోడూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో ఈ తరహా ఘటనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులు దాడులకు గురై గాయపడ్డారు. ఒకచోట ఘర్షణలను నివారించడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. కాగా రెండు చోట్ల వైసీపీ వర్గీయులు తమను నామినేషన్లు వేయన్విడం లేదని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. కాగా ఉద్రిక్తతలను తగ్గించడానికి పోలీసు యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల ముఖ్య నేతలను గృహ నిర్బంధంలో వుంచింది.
చంద్రగిరిలో మారని పరిస్థితి
చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారంతో పోలిస్తే పెద్దగా పరిస్థితిలో మార్పేమీ కనిపించలేదు. తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నాగలక్ష్మి నామినేషన్ వేసేందుకు వెళ్ళగా వెంట వెళ్ళిన ఆమె భర్త చిన్నీయాదవ్‌పై అధికార పార్టీ శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. నామినేషన్ కేంద్రం వద్దే మంగళం బీటీఆర్ కాలనీకి చెందిన వైసీపీ అభ్యర్థి తుంటి సుధా యాదవ్‌పైనా దాడి చేశారు.వైసీపీ విద్యార్థి విభాగం నేత చెంగల్‌రెడ్డి ఫోన్ లాక్కుని పగులగొట్టారు. అతడి బైక్ తాళాలు కూడా లాక్కున్నారు. కాగా రూరల్ మండలానికి చెందిన పలువురు వైసీపీ అభ్యర్థులను ఏఎస్పీ రవిమనోహరాచారి పోలీసు భద్రత నడుమ ఒకేసారి తీసుకొచ్చి నామినేషన్ కేంద్రంలోకి పంపించారు. అయినా మార్గమధ్యంలో టీడీపీ వర్గీయులు అడ్డుకునేందుకు యత్నించారు. ఏఎస్పీ ఎదుటే తమపై దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కుని బయటకు తరిమేశారంటూ నలుగురు అభ్యర్థులు ఆరోపించారు. తుమ్మలగుంట వైపు నుంచీ వైకుంఠపురం ఆర్చి కూడలి వైపు బైక్‌లపై వచ్చే వారిని టీడీపీ వర్గీయులు దౌర్జన్యంగా ఆపి తనిఖీలు చేశారు. ప్రశ్నించిన కొందరిపై దాడికి యత్నించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రామచంద్రాపురం మండల కేంద్రంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెళ్ళగా టీడీపీ వారు అడ్డుకోవడంతో నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. పాకాలలో కూడా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చిన్నగొట్టిగల్లులో కూడా వైసీపీ అభ్యర్థులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
రైల్వేకోడూరులో లాఠీఛార్జి... వైసీపీ శ్రేణుల రాస్తారోకో
రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి పాలెంకోట చంద్రయ్య నామినేషన్ కేంద్రానికి రాగా అక్కడే వున్న అతడి గ్రామానికి చెందిన జనసేన వర్గీయులు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారు. అభ్యర్థిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. ఇరువర్గాల నడుమా ఘర్షణ తలెత్తడంతో పోలీసులు లాఠీ ఛార్జి జరిపి అందరినీ చెదరగొట్టారు. పుల్లంపేట మండల కేంద్రంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కూటమి పార్టీల శ్రేణులు అడ్డుపడ్డాయి.దీంతో వైసీపీ శ్రేణులు నిరసనగా కడప-తిరుపతి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
శ్రీకాళహస్తిలో దాడి... సూళ్ళూరుపేటలో ఆటంకాలు