Share News

రూ.కోట్లు తిన్నా కేసుల్లేవ్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:31 AM

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కొన్ని (సింగిల్‌విండోలు) అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కంచే చేను మేసిన చందంగా రైతుల అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారులే స్వాహాయణానికి పాల్పడుతున్నారు. అవినీతి, అక్రమాలు రూ.కోట్లకు చేరుకున్నా పట్టించుకునే నాథుడేలేడు.

రూ.కోట్లు తిన్నా కేసుల్లేవ్‌
మదనపల్లెలోని డివిజన్‌ సహకారశాఖ కార్యాలయం

సరస్వతిపల్లె విండోలో రూ.6 కోట్ల్ల స్కామ్‌

విచారణలో తేల్చినా స్పందనలేదు

కలెక్టర్‌ ఆదేశించినా చర్యలు శూన్యం

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కొన్ని (సింగిల్‌విండోలు) అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కంచే చేను మేసిన చందంగా రైతుల అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారులే స్వాహాయణానికి పాల్పడుతున్నారు. అవినీతి, అక్రమాలు రూ.కోట్లకు చేరుకున్నా పట్టించుకునే నాథుడేలేడు.

మదనపల్లె, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(సింగిల్‌విండో)లో రూ.2.53 కోట్లకుపై సొమ్ములు స్వాహా అయ్యాయి. రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్థానంలో నకిలీ, గిల్టు నగలు పెట్టి లబ్ధి పొందారు. రైతులు, కస్టమర్ల నుంచి వసూలైన మొత్తాన్ని డీసీబీసీ బ్రాంచికి జమ చేయకుండా స్వాహా చేశారు. సొసైటీ రికార్డుల్లో డ్యూటూ అకౌంట్‌ కింద రికార్డులో నమోదు చేసి సీఈవో అప్పట్లో పరారయ్యారు. ఈ భారీ స్కామ్‌పై మూడునెలల పాటు సమగ్ర విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులు సమర్పించారు. బంగారు నగలపై రూ.2.07కోట్లు, ఇతర విభాగాలకు సంబంధించి రూ.46లక్షలు కలిపి మొత్తం రూ.2.53 కోట్లు సొసైటీకి జమ చేయకుండా స్వాహా చేశారని వివరణాత్మక నివేదిక ఇచ్చారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డీసీసీబీ, సహకారశాఖ, నిమ్మనపల్లె సొసైటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏడు నెలలుగా అటు నిమ్మనపనల్లె, ఇటు మదనపల్లె రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. వివిధ కారణాలతో పోలీసులు కాలం గడుపుతూనే ఉన్నారు. బాధిత అధికారులు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను ఆశ్రయించారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించినా చర్యలు లేకపోవడంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

గుర్రంకొండ, సరస్వతి పల్లె సొసైటీలదీ అదే దారి

గుర్రంకొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ‘బంగారు సొమ్ములు’ స్వాహా అయ్యాయి. రూ.50లక్షలు స్వాహా చేసిన సొసైటీ ఇన్‌ఛార్జి సీఈవో అనిల్‌కుమార్‌ కొన్ని రోజులుగా పరారీలో ఉన్నారు. తాకట్టు బంగారాన్ని విడిపించుకున్న కస్టమర్లు చెల్లించిన సొమ్మును బ్యాంకు ఖాతాకు జమ చేయకుండా స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని గుర్రంకొండకు చెందిన ఇద్దరు ఖాతాదారుల పేరుతో రికార్డుల్లో డ్యూటూ అకౌంట్‌ కింద చూపినట్లు గుర్తించారు. సహకారశాఖ అధికారులు ఆలస్యంగా మేల్కోవడంతో అప్పటికే నిందితుడు తప్పించుకుని వెళ్లిపోయారు. రామాపురం మండలం లక్కిరెడ్డిపల్లె డీసీసీబీ బ్రాంచి పరిధిలోని సరస్వతిపల్లె సొసైటీలో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఏకంగా రూ.6కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు విచారణ అధికారులు లెక్కలు తేల్చారు. విచారణ నివేదికను అటు కడప డీసీసీబీకి, ఇటు రాజంపేట సహకారశాఖ అధికారులు సమర్పించారు. రైతుల నుంచి రికవరీ చేసిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయలేదు. కొంత మొత్తాన్ని రికార్డుల్లో నమోదు చేసి, మిగిలింది జేబులో వేసుకుంటూ వచ్చారు. కొందరు కస్టమర్లకు నకిలీ రసీదులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. సీఈవో రెండు క్యాష్‌ రసీదు బుక్కులను నిర్వహించినట్లు చెబుతున్నారు. రైతులు చెల్లించిన మొత్తంలో సగం సొమ్ముకు అసలైన రసీదు, మరికొంత డబ్బుకు నకిలీ రసీదు జారీ చేశారు. రైతులకు రుణాల మంజూరు, రికవరీలోనూ ఇలాంటి అక్రమాలే జరిగినట్లు లెక్కలు తేల్చారు. నిందితులకు నోటీసులు జారీ చేసి, క్రిమినల్‌ చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2020 నుంచి 2025 మధ్యలో ఈ భారీ స్కామ్‌ జరిగినట్లు చెబుతున్నారు.

ఆధ్యులు, బాధ్యులు అధికారులే..

సహకార సొసైటీల్లో వరుస అక్రమాలు, భారీ స్కామ్‌లకు ఆయా శాఖల అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణమని స్పష్టమవుతోంది. రుణాల మంజూరు నుంచి పర్యవేక్షణ వరకూ అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. బంగారు రుణాల మంజూరులో ఆది నుంచీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అటు డీసీసీబీ, ఇటు సహకారశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీఈవోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సొసైటీ ఆపరేషన్‌ పరిధిలోని రైతులకు, అందులోనూ సొసైటీలోని సభ్యుడికి మాత్రమే బంగారంపై రుణం ఇవ్వాలి. అలాగే సొసైటీలో సేవింగ్‌ ఖాతా ప్రారంభించాలి. బంగారంపై ఇచ్చే రుణం కూడా సొసైటీ ఖాతాకు జమచేయాలి. కానీ ఇవేమీ జరగలేదు. కీలకమైన అప్రైజర్‌ నియామకంలోనూ నిబంధనలు పాటించలేదు.

తూతూమంత్రంగానే తనిఖీలు

సొసైటీ లావాదేవీలపై అటు సెంట్రల్‌ బ్యాంకు, డీసీసీబీ బ్రాంచి, డివిజన్‌ స్థాయి సహకార శాఖ, ఆడిట్‌, నోడల్‌ అధికారులు లోతుగా చూడలేదని తెలుస్తోంది. లాకర్‌లోని బంగారం బ్యాగులను చూడటం వరకే పరిమితమవుతున్నారు. అనుమానం వస్తే తప్పాబంగారం నాణ్యత, టచ్‌ను పరీక్షించడం లేదు. రుణాల మంజూరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ, నిబంధనలపై దృష్టి పెట్టలేదని స్పష్టమవుతోంది.

Updated Date - Oct 10 , 2026 | 01:31 AM