నిమ్మనపల్లె సొసైటీ సీఈవో పోలీస్ కస్టడీకి..
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:47 AM
రూ.2.53కోట్ల స్కామ్‌లో అరెస్టయి స్థానిక సబ్‌జైలులో నిందితుడిగా ఉంటున్న నిమ్మనపల్లె సహకార సొసైటీ సీఈవో పి.హరినాథ్‌రెడ్డిని రూరల్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.
- రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణ
మదనపల్లె, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రూ.2.53కోట్ల స్కామ్‌లో అరెస్టయి స్థానిక సబ్‌జైలులో నిందితుడిగా ఉంటున్న నిమ్మనపల్లె సహకార సొసైటీ సీఈవో పి.హరినాథ్‌రెడ్డిని రూరల్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. విచారణలో భాగంగా సీఈవోను కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు మదనపల్లె అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించగా ఆమోదిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సర్కిల్ పోలీసు కార్యాలయంలో మొదటి రోజు విచారించి, పలు కీలకమైన అంశాలు రాబట్టారు. తిరిగి ఆదివారం సాయంత్రం 5గంటలకు కోర్టులో హాజరుపరచనున్నారు. ‘సొసైటీలో స్కామ్‌కు కారణాలేంటి? ఎలా జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత’ తదితర అంశాలపై రూరల్ సీఐ రవినాయక్ బృందం నిందితుడికి ప్రశ్నలు సంధించారు. కాగా, విచారణలో నిందితుడి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని తెలిసింది. ఈ నెపాన్ని వేరేవాళ్లపై నెట్టే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రూ.60లక్షలు వాడుకున్నానని, మిగిలిన మొత్తంలో మరో ఇద్దరి పాత్ర ఉందని చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం. మరోవైపు నిందితుడి ఆర్థిక లావాదేవీలను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. ఆయన చెప్పిన మరో ఇద్దరిని కూడా పోలీసులు విచారించనున్నారు.