Share News

కొత్త వార్డులొస్తున్నాయ్‌

ABN , Publish Date - May 18 , 2026 | 01:02 AM

మున్సిపాలిటీల్లో విభజన కసరత్తు పూర్తి 100 నుంచి 128కి పెరుగుదల ఫామ్‌-1 నోటిఫికేషన్‌ విడుదల

కొత్త వార్డులొస్తున్నాయ్‌
మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం

మదనపల్లె, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలలో పూర్వపు వార్డుల ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి కొత్త వార్డులను విభజించారు. మూడు మున్సిపాలిటీల్లో ఇదివరకే మొత్తం 100 వార్డులు ఉండగా విభజన అనంతరం వాటి సంఖ్య 128కి పెరిగింది. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఓటర్ల సంఖ్య, 2011 జనాభా గణాంకాల ఆధారంగా వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మదనపల్లె, రాయచోటి, పుంగనూరు కమిషనర్లు కె.ప్రమీల, రమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఫామ్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సోమవారం నుంచి 24వ తేదీ వరకూ వార్డుల సరిహద్దులపై సూచనలు, సలహాలతోపాటు అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలపాలని సూచించారు. 25వతేదీ నుంచి జూన్‌ 5 వరకు ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను మున్సిపల్‌ అధికారులు కలెక్టర్‌కు నివేదిస్తారు. జూన్‌ 6వ తేదీ నుంచి 11 వరకూ కలెక్టర్‌ వీటిని పరిశీలించిన అనంతరం మున్సిపల్‌ డీఎంఏకు, అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లనుంది. చివరిగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయనుంది. ఆ జాబితా ఆధారంగానే ఎన్నికలకు వెళ్లనున్నారు.

వార్డులు పెరిగిందిలా..

మదనపల్లె సెలెక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలో 2011 లెక్కల ప్రకారం 1,36,414 మంది జనాభా, 1,16,980 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే పురపాలికలో గతంలో 35 వార్డులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 48 పెరిగింది. కొత్తగా 13 వార్డులు పెరిగాయి. 48 వార్డులలో ఒక్కో వార్డుల్లో కనిష్టంగా 2,168 మంది, గరిష్ఠంగా 2,685 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే సగటున 2,437 ఓటర్లకు చేరారు. రాయచోటి మున్సిపాలిటీలో 89,763 మంది జనాభా, 79,224 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 34 వార్డులు ఉండగా, విభజన తర్వాత వాటి సంఖ్య 44 చేరింది. కొత్తగా పది వార్డులు పెరిగాయి. పుంగనూరు మున్సిపాలిటీలో 56,233 మంది ఉండగా, 43,804 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 31వార్డులు ఉండగా, తాజాగా వాటి సంఖ్య 36 వార్డులు చేరుకోగా, కొత్తగా ఐదు వార్డులు పెరిగాయి.

Updated Date - May 18 , 2026 | 01:02 AM